వ్యాక్సిన్ల ధర ఎంతుందంటే తెలుసా..?
ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికాల్లోని అల్పాదాయ దేశాలు కూడా వేగంగా, పారదర్శకంగా, అందరితో సమానంగా కోవిడ్ వ్యాక్సీన్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి. వీటిలో ఏ ఒక్కటి సఫలమైనా, 2021 చివరికల్లా 200 కోట్ల డోసులు సరఫరా చేయాలని ఆశిస్తున్నారు. ఒకవేళ ధనిక దేశాలకు మాత్రమే రక్షణ దక్కితే... మహమ్మారి మిగతా ప్రపంచంపై ప్రతాపం కొనసాగిస్తున్నకొద్దీ అంతర్జాతీయ వాణిజ్యం, సమాజం అన్నీ దెబ్బతింటాయని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వ్యాక్సీన్ల కోసం వందల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడుతున్నారు. మరోవైపు వాటిని కొనుగోలు చేసి, ప్రజలకు అందించేందుకు మిలియన్ల కొద్దీ డాలర్ల విరాళాలు వస్తున్నాయి. వ్యాక్సీన్ ఏ రకం, తయారీదారు ఎవరు, ఎన్ని డోసులు ఆర్డర్లు చేశారన్న అంశాలపై దాని ధర ఆధారపడి ఉంటుంది. ఫార్మా సంస్థ మోడెర్నా తాము అభివృద్ధి చేస్తున్న ఒక్కోవ్యాక్సీన్ రూ.2,350 నుంచి రూ.2,717 మధ్య ధరకు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిసింది. మరోవైపు ఆస్ట్రాజెనెకా సంస్థ తాము పూర్తిగా లాభం తీసుకోకుండా గానీ, లేదా చాలా తక్కువ లాభం మీదే గానీ అమ్ముతామని ప్రకటించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సీన్ తయారీదారు అయిన భారత సంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి గావీ, బిల్ & మిలిండా గేట్స్ ఫౌండేషన్ 15 కోట్ల డాలర్ల సాయం అందిస్తున్నాయి. ఈ సంస్థ భారత్‌తోపాటు మధ్య ఆదాయ దేశాలకు కోవిడ్ వ్యాక్సీన్ 10 కోట్ల డోసులను అందించాలని ఆశిస్తోంది. ఒక్కో డోసుకు రూ.220 గరిష్ఠ ధరగా నిర్ణయించింది.