తెలంగాణలో అతిపెద్ద పార్టీగా,
ఎప్పుడూ టిఆర్ఎస్ ఖాతాలో విజయాన్ని నమోదు చేయడం తప్ప, అపజయం అనేది లేకుండా చూసుకుంటూ వచ్చిన
కేసీఆర్ కు దుబ్బాక ఉప ఎన్నికలు పెద్ద షాక్ నే కలిగించాయి. కానీ అనూహ్యంగా దుబ్బాక
అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓటమి చెందడాన్ని ఇప్పటికీ కెసిఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు ఇంతగా
పార్టీ పట్టు ఎందుకు జారి పోయింది అనే విషయంపై ఆయన ఆరా తీస్తున్నారు. అలాగే
బీజేపీ ఒక్కసారిగా ఎలా బలం పుంజుకుంది ? టిఆర్ఎస్ ఎందుకు బలహీనం అయ్యింది ? ఆ పరిస్థితి రావడానికి కారణం ఏమిటి అనే అన్ని విషయాలపైనా ఇప్పుడు
కేసీఆర్ తెలుసుకునే పనిలో ఉన్నారు.
దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలతో గ్రేటర్
హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పైన ఆ ప్రభావం కనిపించే అవకాశం ఉండడం ,పార్టీ శ్రేణుల్లో భయాందోళనలు నెలకొనడం, ఇలా ఎన్నో అంశాలపై నేడు కొంతమంది మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలోనే జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించి అన్ని అంశాల పైన చర్చించబోతున్నట్లు సమాచారం. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల ప్రభావం జిహెచ్ఎంసి ఎన్నికలపై పడకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం పైన ఈ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సమావేశం అనంతరం జిహెచ్ఎంసి ఎన్నికల నిర్వహణ పై పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు టిఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.ఈ సమావేశం కాకుండా మరో రెండు మూడు రోజుల్లో మొత్తం మంత్రిమండలి తో సమావేశం నిర్వహించి, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు , లోటు పాట్లు, ప్రజల్లో బలం పెంచుకునేందుకు
పార్టీ పరంగానూ, ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు, జీహెచ్ఎంసీ ఎన్నిక లో ఏ విధంగా గట్టెక్కాలి ఇలా అనేక అంశాలపై పూర్తిస్థాయిలో చర్చించి నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈరోజు జరిగే అత్యవసర సమావేశంలో
కేసీఆర్ ఎటువంటి సంచలనాల దిశగా అడుగులు వేస్తారనే ఉత్కంఠ మంత్రుల్లో నెలకొంది.