వీర జవానుకు కన్నీటి నివాళి..!
ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందిన తెలంగాణ బిడ్డ వీర జవాన్ మహేష్ కు అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం, కోమన్‌పల్లిలో వీరజవాన్ అంత్యక్రియలు సైనిక లాంచనాలతో జరిగాయి. అంతిమ యాత్రలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ అరవింద్, జడ్పీ ఛైర్మన్ విఠల్‌రావు, కలెక్టర్ నారాయణరెడ్డి సీపీ కార్తికేయతో పాటు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కోమన్‌పల్లికి తెల్లవారుజామున మహేష్ మృత దేహాన్ని ఆర్మీ అధికారులు తీసుకువచ్చారు. మహేష్ పార్థివదేహాన్ని చూసి గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపించారు. జయహో జవాన్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. మధ్యాహ్నం మహేష్ మృతదేహానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
మహేష్ పార్ధీవ దేహం దగ్గర ప్రజాప్రతినిధులు.. మద్రాస్ రెజ్‌మెంట్ అధికారులు శ్రద్దాంజలి ఘటించారు. పూల గుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు.. అనంతరం గ్రామంలో అంతిమ యాత్ర కొనసాగింది.. జనాలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ అరవింద్ లు సైతం మహేష్ శవపేటికను మోశారు. పెట్టెను మోశారు.
మహేష్ పార్ధీవ దేహంపై భార్య సుహాసిని జాతీయ జెండాను కప్పారు.. ఆర్మీ అధికారుల సమక్షంలో సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలికారు. శోకసంద్రంలో మునిగిన సుహాసినిని చూసి అంతా చలించిపోయారు. కుటుంబ సభ్యులు ఎంత ఓదార్చినా ఆమె కంట కన్నీరు ఆగలేదు.
ఇక, ఈ నెల 21న మహేష్ బర్త్ డే కూడా ఉంది. కరోనా వల్ల ఇన్నాళ్లు రాలేకపోయిన తాను... బర్త్ డే నాటికి ఇంటికొస్తానని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చెప్పాడు మహేష్. రెండు మూడు రోజుల్లో వస్తాడనగా.. ఒక్క సారిగా మరణవార్త విని అంతా షాకయ్యారు. కోమటిపల్లిలో ఛాయలు అలుముకున్నాయి.
మొదటి నుంచీ ఆర్మీలో పని చేయాలన్న దే మహేష్ కలగా ఉండేది.. నిజామబాద్‌లోని శాంఖరి కాలేజీ లో ఇంటర్మీడియట్ చదివిన మహేష్.. 2014లో ఆర్మీకి ఎంపికయ్యారు. రెండేళ్ల క్రితం హైదరాబాదుకు చెందిన సుహాసినిని ప్రేమ వివాహం చేసుకున్నారు. భర్తను ఎంతగానో ప్రేమించే సుహాసినికి.. మహేష్ చనిపోయిన విషయాన్ని వెంటనే చెప్పలేదు కుటుంబసభ్యులు. దీంతో, ఏం జరిగిందంటూ ఆమె అందరినీ అడగడం.. ప్రతి మనసునూ కలచివేసింది. కాస్త తేరుకున్నాక అసలు విషయం చెప్పి సముదాయించారు కుటుంబ సభ్యులు.
వీర జవాన్ మహేశ్ ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి , సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు.. మహేష్ సేవల్ని కొనియాడారు. మహేష్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్.. 50 లక్షల ఆర్థిక సాయంతో పాటు, ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు..