కృష్ణమ్మ మహోగ్రరూపం..!

NAGARJUNA NAKKA
కృష్ణా నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది.  జిల్లాలో వర్షాలు లేకున్నా..ఎగువ నుంచి వస్తున్న వరదతో ఇళ్లు, పంటలు నీట మునిగాయి. పెనమలూరు మండలంలో ఉద్యాన వన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పెదపులిపాక పరిసర ప్రాంతాల్లో కాలనీల్లోకి నీరు చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ప్రకాశం బ్యారేజ్‌కి 7 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. వచ్చిన నీటిని వచ్చినట్టు  పూర్తిగా దిగువకు వదులుతున్నారు అధికారులు. బ్యారేజ్ దిగువన ఉన్న ఇళ్లు, పొలాల్లోకి భారీగా నీరు చేరింది. ముఖ్యంగా పెనమలూరు నియోజవకర్గంలోని పలు మండలాల్లో అధికంగా పంట నష్ట జరిగింది. మరోవైపు విజయవాడ నగరానికి దగ్గర్లో ఉన్న కాలనీల్లో నీరు చేరింది. దీంతో ఇళ్లలో ఉండలేక.. బయటకు వెళ్లలేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పెదపులిపాక పంచాయతీ పరిథిలోని శ్రీనివాస నగర్ కాలనీలో వందల సంఖ్యలో ఇళ్లు నీట మునిగాయి.

ప్రకాశం బ్యారేజ్ కు వరద పోటెత్తడంతో లంక గ్రామాలు నీటమునిగాయి. రెండు మూడు రోజుల పాటు ఇదే మాదిరి ప్రవాహం కొనసాగితే.. పంటలు బతికే అవకాశం ఉండదంటున్నారు రైతులు. గత నెలలో వచ్చిన వరదలకే పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ఈ సారి అంతకు మించి వరద రావడంతో కోలుకోలేని దెబ్బతగిలిందని రైతులు వాపోతున్నారు.

కృష్ణా జిల్లాలో 30 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. గతంలో జరిగిన పంట నష్టానికి కూడా పరిహారం అందలేదని రైతులు వాపోతున్నారు. కృష్ణా నదిలో ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలకు..తెలంగాణ వర్షాల కారణంగా వస్తున్న వరద అదనంగా తోడవుతుంది. దీంతో మరి కొద్ది రోజులు కృష్ణా వరదలు ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ.. ప్రజలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. ఎపుడు వరదలు తగ్గుతాయో.. తమ కష్టాలు ఎపుడు తీరతాయో తెలియక కృష్ణా పరివాహక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.









మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: