శబరిమలకు వెళ్లనున్నారా.. అయితే ఇవే ఆంక్షలు..!
కేరళలో కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. కొన్ని రోజుల నుంచి భారీ సంఖ్యలో కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే సమయంలో శబరిమల యాత్ర కూడా దగ్గర పడుతుండటంతో.. అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో స్థానిక భాషల్లో ప్రచురిస్తూ, అందరికీ తెలియజేయాలని కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విశ్వాస్ మెహతా.. అధికారులను ఆదేశించారు.
భక్తులు ముందుగానే కేరళ పోలీస్‌శాఖ అభివృద్ధి చేసిన వర్చువల్ క్యూ పోర్టల్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. వివరాలకు శబరిమలయ ఆన్‌లైన్ వెబ్ సైట్ చేక్ చేసుకోవచ్చు. వారం ప్రారంభంలో రోజుకు వెయ్యి మంది , వారాంతాల్లో రెండు వేల మంది చొప్పున పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు.పరిస్థితులను బట్టి ఈసంఖ్యలో మార్పు ఉంటుంది. దర్శనానికి 48 గంటల ముందు కరోనా నిర్ధారణ పరీక్షలు విధిగా చేయించుకోవాలి. అందులో నెగటివ్ వచ్చినవారినే ఆలయంలోకి అనుమతిస్తారు. ప్రవేశమార్గంలోనూ యాంటీజెన్ పరీక్షలు నిర్వహిస్తారు. పదేళ్లలోపు చిన్నారులు,, 60 ఏళ్లు దాటిన వారిని దర్శనానికి అనుమతించరు. దీర్ఘకాలిక, గుండె సమస్యలతో బాధపడుతున్న వారు కూడా శబరిమల యాత్రకు రాకూడదని గైడ్‌లైన్స్ చెబుతున్నాయి.శబరిమల యాత్రకు వచ్చిన వాళ్లు తమతో ఆయుష్మాన్ భారత్, బీపీఎల్ తదితర ఆరోగ్యబీమా కార్డులను వెంటతెచ్చుకోవాల్సి ఉంటుంది.స్వామికి నెయ్యితో అభిషేకాలు, పంపా నదిలో స్నానాలు, సన్నిధానంలో రాత్రి బసచేయడం లాంటి వాటిని అనుమతించరు. కేవలం ఎరుమేలి, వడసెర్రికర మార్గాల్లో మాత్రమే భక్తులను అనుమతిస్తారు. మిగతా అన్ని రూట్లను తాత్కాలికంగా మూసివేయనున్నారు. మొత్తానికి శబరిమల యాత్రకు వెళ్లేవారికి కొత్త ఆంక్షలు పలుకరిస్తున్నాయి.