రైతులు తొందరపడవద్దు.. మద్దతుధరకు ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుంది: కమలాకర్‌

Suma Kallamadi
ఈ మధ్య కాలంలో ప్రభుత్వమే నేరుగా రైతుల నుండి గూడ్స్ ని కొనుగోలు చేయడం మనం చూస్తూ వున్నాం. ఇది వరకు రైతులకు, ప్రభుత్వానికి మధ్య దళారులు ఉండేవారు. అందువలన రైతులు ఎక్కువ నష్టపోయే వారు. ఇపుడు పరిస్థితులు మారాయి. రైతులు పంటలను నేరుగా ప్రభుత్వానికి అమ్మిన తరువాత వారి బ్యాంకు ఖాతాలలో ప్రభుత్వం సరుకుకి సంబంధించిన డబ్బులను జమ చేసేస్తుంది. ఏపీలో కూడా ఈ విధానాన్ని మనం గమనించవచ్చు.

ఇకపోతే.. ఈరోజు మంత్రి గంగుల కమలాకర్ సచివాలయం బీఆర్కే భవన్‌లో వరిధాన్యం కొనుగోలుపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తొందరపడి ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్మవద్దని సూచించారు. ఇకపోతే రైతులు ధాన్యం మంచిగా ఎండబెట్టాలని, తాలు, పొళ్లు లేకుండా జాగ్రత్తపడి తెచ్చిన ధాన్యానికి మంచి మద్దతు ధర పలుకుతుందని సూచించారు.

ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఈ వానాకాలంలో పండించిన వరి ధాన్యం కొనుగోలుకు 6 వేల కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. కాగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతి ఒక్కరూ కొవిడ్‌-19 నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, అలాగే వచ్చిన వారికి ఇబ్బందులు కలగకుండా అధికారులు జాగ్రత్తలు పడాలని ఆదేశించారు.

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు డబ్బులు త్వరగా అందేటట్లు చూడాలని అధికారులను ఈ సందర్భంగా కోరారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సిబ్బందిని వేగంగా సర్దుబాటు చేసుకోవాలని అధికారులకు కమలాకర్‌ సూచించారు. ధాన్యానికి అవసరమైన గోనె సంచులను ముందుగానే సిద్ధం చేసుకోవాలని అన్నారు. కాగా.. ఈ సమావేశంలో పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, పౌరసరఫరాల శాఖ కమీషనర్‌ అనిల్‌ కుమార్‌, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్ధన్‌ రెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: