సామాన్యుడు కడుపు మాడ్చుకోవాల్సిందేనా..?

NAGARJUNA NAKKA
కరోనా మహమ్మారి కారణంగా ఆదాయం అంతంత మాత్రం ఉంటోంది. దీంతో కాస్త ఖర్చులు తగ్గించుకొని కుటుంబాన్ని నడిపేద్దామనుకుంటున్న సామాన్యుడికి.. కూరగాయలు, నిత్యావసరాల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.  పెరిగిన ధరలతో సగటుజీవి విలవిల్లాడుతున్నాడు. కుటుంబం నెలవారీ బడ్జెట్‌ లెక్కలు అంచనాలు తప్పుతున్నాయి. తాజాగా పెరిగిన ధరలతో ఒక్కో కుటుంబంపై నెలకు రూ.1500 నుంచి రూ.2000 వరకు అధిక భారం పడుతోంది. ఫలితంగా నెల బడ్జెట్‌ కాస్తా ఓ వారం ముందే అయిపోతోంది.

పప్పుల ధరలు వింటేనే గుండె దడ పుడుతోంది. కిలో 95 రూపాయలుగా ఉన్న కందిపప్పు ..110 రూపాయలు దాటింది. మినపప్పు 110  నుంచి 130 రూపాయలకు చేరింది. ఇక వంటనూనెల ధరలు అమాంతం పెరిగింది. గతంలో కిలోకు రూ.2 నుంచి రూ.5 మాత్రమే పెరిగే నూనె ధర.. ప్రస్తుతం ఏకంగా రూ.30 నుంచి 40 దాకా పెరిగింది. బహిరంగ మార్కెట్‌లో రూ.95 నుంచి 100 లోపు పలికిన వంట నూనె.. తాజాగా 130 నుంచి 140కి ఎగబాకింది. కరోనా నేపథ్యంలో హోటళ్లు, శుభకార్యాలు అంతగా లేకపోవడంతో నూనెలకు డిమాండు లేక ధరలు తగ్గాలి. కానీ గత 20 రోజులుగా  వేరుసెనగ, రైస్‌బ్రాన్‌, పామాయిల్‌ ధరలూ మండిపోతున్నాయి.

కరోనా సమయంలో రోగనిరోధక శక్తి కోసం చికెన్‌, గుడ్లు తినాలని వైద్యులు సూచించడంతో అందరూ దానిని పాటిస్తున్నారు. దీంతో గుడ్ల ధర కూడా పెరిగిపోయింది. ఒక గుడ్డు ఇంతకుముందు ఐదు రూపాయల వరకు ఉండగా.. ఇప్పుడు అది 7కు పెరిగింది. ఇక ఆగస్టులో కిలో రూ.160 ఉన్న చికెన్‌ ధర ప్రస్తుతం రూ.220 దాకా ఉంది. మటన్ కిలో రూ.700 నుంచి రూ.800 వరకు అమ్ముతున్నారు.

కూరగాయల ధరలైతే ఏకంగా రెట్టింపయ్యాయి. ఇంతకుమునుపు రైతుబజార్‌కు వెళ్లి రూ.200 ఖర్చు చేస్తే వారం రోజులకు సరిపడే కూరగాయలు వచ్చేవి. కానీ, ఇప్పుడు అదే రూ.200తో మూడు రోజులకు సరిపోయే కూరగాయలు కూడా రావడం లేదు. ఏ కూరగాయలు చూసినా కిలో రూ.60 నుంచి 80 వరకు ఉంటున్నాయి.  ఆకు కూరల ధరలు సైతం భగ్గున మండుతున్నాయి. గతంలో రూ.10కి మూడు నాలుగు కట్టలు ఇవ్వగా, ప్రస్తుతం అవే మూడు కట్టలను రూ.20కి అమ్ముతున్నారు...

ఇక ఉల్లి.. కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తోంది. పెరుగుతున్న ధరలు చూసి జనం భయపడుతున్నారు. ధరలు రోజురోజుకు పెరగడమే తప్ప తగ్గే సూచనలు కానరావడం లేదు. భారీ వర్షాలకు పంట దెబ్బతినడంతో ఉల్లి రేట్ భగ్గుమంటోంది. ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద హోల్ సేల్ ఉల్లి మార్కెట్ అయిన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మార్కెట్ లో మేలు రకం ఉల్లి కిలో 40పైనే పలుకుతోంది. ఈ సీజన్ లో మామూలుగా ఉల్లి కిలో 20 మించి పలకదు, దీనికి విరుద్ధంగా ఏకంగా రెండురెట్లుకుపైగా పెరిగింది. మహారాష్ట్ర, కర్నూలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో.. అక్కడ ఉల్లి పంట దెబ్బతింది. పంట దిగుబడి తగ్గడంతో ఉల్లి రేట్ కు రెక్కలు వచ్చాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మహారాష‌్ట్ర నుంచి కొత్త రకం పంట వస్తేగాని ఉల్లి ధర తగ్గే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఉల్లి ధరలతో జనం బెంబేలు ఎత్తుతున్నారు. కిరాణం షాపుల్లో ఉల్లి వంక చూడాలనే బెదిరిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: