జిహెచ్ఎంసి ఎన్నికల బరిలో కొత్త పార్టీ... పేరేంటో తెలుసా..?
అధికార పార్టీ జిహెచ్ఎంసి ఎన్నికల ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి ఎలాగైనా జిహెచ్ఎంసి ఎన్నికల్లో మరోసారి విజయకేతనం ఎగురవేయాలని టిఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అయితే అధికార పార్టీతోపాటు... రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ పార్టీ కూడా ఇప్పటి నుంచే పావులు కదుపుతూ జిహెచ్ఎంసి ఎన్నికల కోసం కసరత్తులు ప్రారంభించింది. అయితే ప్రతిసారి టీఆర్ఎస్ ఎంఐఎం కాంగ్రెస్ బిజెపి పార్టీలు ప్రధాన పార్టీలుగా జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ పడుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.
కానీ ఈ సారి మాత్రం జిహెచ్ఎంసి ఎన్నికల బరిలోకి మరో కొత్త పార్టీ రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం అవుతుంది అని ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కపిలవాయి దిలీప్ కుమార్ వెల్లడించటం ఆసక్తికరంగా మారిపోయింది. కేవలం జిహెచ్ఎంసి ఎన్నికలలో మాత్రమే కాదు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం... తమ పార్టీ పోటీ చేస్తుంది అంటూ ఆయన తెలిపారు. తమ పార్టీ తరఫున ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ మహిళలకు 90 శాతం సీట్లు కేటాయించినట్లు చెప్పుకొచ్చారు దిలీప్ కుమార్. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకే జి హెచ్ ఎం సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు.