ధరణి పోర్టల్ ఎపుడు ప్రారంభమో తెలుసా..?
దసరా పండుగ రోజున ధరణి పోర్టల్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు అవసరమైన అన్ని కార్యక్రమాలను నిర్ధేశిత గడువులోపలే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దసరా రోజు పోర్టల్ ప్రారంభిస్తున్నందున అదే రోజు రిజిస్ట్రేషన్ లు కూడా ప్రారంభమవుతాయని సీఎం చెప్పారు. ఈ లోగా ఎలాంటి రిజిస్ట్రేషన్ లు కానీ.. ఎలాంటి రెవెన్యూ వ్యవహారాలు కానీ జరగవని స్పష్టం చేశారు.
ధరణి పోర్టల్ కు అవసరమైన సాఫ్ట్ వేర్.. హార్డ్ వేర్ బ్యాండ్ విడ్త్ లను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. మారిన రిజిస్ట్రేషన్ విధానం మ్యూటేషన్ వివరాలను అప్ డేట్ చేయడం తదితర అంశాలపై తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లకు అవసరమైన శిక్షణ ఇవ్వనున్నట్టు సీఎం తెలిపారు. డెమో ట్రైల్స్ కూడా నిర్వహించి అధికారులకు అవగాహన కలిగించాలని నిర్ణయించినట్టు చెప్పారు.
ధరణి పోర్టల్ ప్రారంభం కావడానికి ముందే.. రాష్ట్రవ్యాప్తంగా సర్వే నెంబర్ల వారీగా రిజిస్ట్రేషన్ల రేట్లు నిర్ణయించనున్నట్టు సీఎం చెప్పారు. అదే రేట్ల ప్రకారం రిజిస్ట్రేషన్లు జరుగుతాయని చెప్పారు. తహశీల్దార్ల కార్యాలయాలు, రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్స్ కు లైసెన్స్ లు ఇచ్చి వారికి శిక్షణ కూడా ఇవ్వనున్నట్టు తెలిపారు. నూతన చట్టాల అమలు సందర్భంగా ఏ ఒక్క నిరుపేదకు బాధ కలగకుండా చివరి గుడిసె వరకు వాటి ఫలితాలు అందేలా చూడటం తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త విధానాలతో ముందుకెళుతోంది. ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో దూసుకెళ్తోంది.