బెంజ్ కారుని వదలని అయ్యన్న.. మంత్రికి తిప్పలు తప్పవా...
అయితే కారుతో తన తనయుడుకు సంబంధం లేదని ఓ సారి చెప్పిన జయరాం, కారు ఫైనాన్స్ కట్టకపోవడంలో సీజ్ చేశారని మరోసారి చెప్పారు. ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదలకూడదని అయ్యన్న గట్టిగా ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. అందుకే జయరాం మీద ఏసీబీకు ఫిర్యాదు చేశారు. అలాగే దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇచ్చానని చెబుతున్నారు.
ఒక వ్యాపారస్తుడు అంత ఖరీదైన కారు ఎందుకు బహుమతి ఇచ్చారో చెప్పాలని, రాష్ట్రంలో అవినీతి జరిగితే క్షమించను అన్న ముఖ్యమంత్రి ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు. అలాగే ఏసీబీ వద్ద న్యాయం జరగకపోతే గవర్నర్‌ను కలుస్తామని, మంత్రి జయరాంకి, తనకు పరిచయం లేదని, వ్యక్తిగతంగా కక్ష సాధించవలసిన అవసరం తనకు లేదని మాట్లాడుతున్నారు. వ్యక్తిగతంగా ఎలాంటి కక్ష లేదని చెప్పినా, అయ్యన్న మాత్రం జయరాంని టార్గెట్ చేసుకునే రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
అయితే దీనిపై జగన్ కూడా సీరియస్‌గా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియదుగానీ, ఇటీవల మంత్రి సొంత వూరులో పేకాట క్లబ్ నిర్వహించడం, అందులో మంత్రి పేరు రావడం, ఇప్పుడు మంత్రి కుమారుడు బెంజ్ కారు ఇష్యూలో చిక్కుకోవడంతో జగన్, జయరాంపై సీరియస్‌గా ఉన్నారని, ఇందులో నిజనిజాలు తెలుసుకోవాలని అధికారులని ఆదేశించారని టీడీపీ అనుకూల మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి చూడాలి మంత్రి జయరాం విషయం చివరికి ఏం అవుతుందో. మొత్తానికైతే అయ్యన్న మాత్రం బెంజ్ కారుని వదిలేలా కనిపించడం లేదు.