లోక్ సభను తాకిన డ్రగ్స్ వ్యవహారం..!
సుశాంత్ కేసు దర్యాప్తు.. అటు తిరిగి ఇటు తిరిగి బాలీవుడ్, శాండల్ వుడ్, టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారాలను తెరపైకి తీసుకువస్తోంది. తీగలాగితే డొంక కదిలినట్టు సినిమా స్టార్ల డ్రగ్స్ లింకులు బయటపడుతున్నాయి. రియా ఇంటరాగేషన్ తర్వాత.. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో దూకుడు పెంచింది. ఇప్పటికే సుశాంత్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేసిన అతడి ప్రియురాలు రియా చక్రవర్తితోపాటు ఆమె సోదరుడు షోవిక్ సహా 16 మందిని అరెస్టు చేసింది. డ్రగ్ డీలర్‌గా పనిచేసే ఫెర్నాండెజ్.. రియా సోదరుడు షోవిక్‌కు సహాయకుడిగా వ్యవహరించేవాడని దర్యాప్తులో తేలింది.
అటు బాలీవుడ్‌లో డ్రగ్స్ కలకలంపై లోక్‌సభలో గళమెత్తారు బీజేపీ ఎంపీ రవికిషన్. బాలీవుడ్‌లో మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణా విపరీతంగా పెరిగిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశ యువతను నాశనం చేయటానికి కుట్ర జరుగుతోందని, పొరుగుదేశాలు ఇందుకు సహకారం అందిస్తున్నాయని ఆరోపించారు. పాకిస్తాన్, చైనాలనుంచి పెద్ద ఎత్తున ప్రతి ఏటా మత్తు పదార్థాలు దేశంలోకి అక్రమంగా రవాణా అవుతున్నాయన్నారు.
మరోవైపు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ వ్యవహారం దేశవ్యాప్తగా హాట్ టాపిక్‌గా మారింది. ముంబై వచ్చాక శివసేన ప్రభుత్వంతో వివాదానికి దిగిన కంగనా రనౌత్.. నాలుగు రోజుల తర్వాత తిరిగి హిమాచల్ ప్రదేశ్ వెళ్తూ భావోద్వేగంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ నాలుగు రోజులు తనను ఎంత భయభ్రాంతులకు గురిచేశారో.. ఎన్ని దుర్భాషలాడారో.. చూస్తే తాను చేసిన పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనే కామెంట్లు సరైనవే అనిపిస్తోందని వ్యాఖ్యానించింది..
మొత్తం మీద మహారాష్ట్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైన బాలీవుడ్ నటి కంగన రనౌత్‌కు చిక్కులు తప్పట్లేదు. డ్రగ్స్ కేసులో ఆమెను విచారించాలని మహా సర్కారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే ఆమెను విచారించే అవకాశం ఉంది.