ఒక్క అడ్మీషన్ కూడా అనుమానమే..?
తెలంగాణలో ఈ సారి ఇంటర్లో విద్యార్థుల ఎక్కువ మంది ఉత్తీర్ణత సాధించారు. కరోనా లాక్డౌన్ వల్ల అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ నిర్వహించ లేదు. ఈ క్రమంలో ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి అయిన విద్యార్థులందరినీ పాస్ చేసింది ప్రభుత్వం. దీంతో ఉత్తీర్ణులయిన విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఫలితంగా డిగ్రీ కాలేజీల్లో చేరే వాళ్ల సంఖ్య భారీగా ఉంటుందని భావించారు అధికారులు. కానీ, ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ సరళిని చూస్తే అడ్మిషన్స్ అనుకున్న స్థాయిలో జరుగుతాయని అనిపించడం లేదు.
తెలంగాణ దోస్త్ లో నమోదు చేసుకున్న డిగ్రీ కళాశాలల సంఖ్య వెయ్యి 59. ఇందులో ఉన్న సీట్ల సంఖ్య 4 లక్షల 24 వేల 315. మొదటి ఫేజ్లో దరఖాస్తు చేసుకున్న వాళ్ల సంఖ్య 2 లక్షలు కూడా లేదు. ఇందులో ఎంత మంది అడ్మిషన్ తీసుకుంటారో తెలియదు. ఎంసెట్ రాసిన విద్యార్థులలో ఎక్కువ మంది ఇంజనీరింగ్ కళాశాలల్లో జాయిన్ అవుతారు. ప్రతి ఏడాది డిగ్రీ సీట్లు వేలల్లో మిగిలిపోతుండడంతో డిగ్రీ కళాశాలల హేతుబద్దీకరణ చేస్తామని ఉన్నత విద్యామండలి ప్రకటించినా... అది కూడా కార్యరూపం దాల్చ లేదు. కొన్ని కళాశాలల్లో అసలు అడ్మిషన్స్ అన్నవే లేవు. కొన్ని కాలేజీల్లో సింగిల్ డిజిట్ దాట లేదు. గతేడాది 78 కళాశాలల్లో ఒక్క అడ్మిషన్ కూడా జరగలేదు. ఈ సారి కరోనా కూడా తోడైంది. దీంతో భారీగా సీట్లు మిగిలిపోవడం ఖాయమని తేలిపోయింది.
కరోనా ప్రభావం వల్ల ఇప్పటికే విద్యా సంవత్సరం ఆలస్యమైంది. ఇప్పుడు డిగ్రీ కాలేజీల్లో సగం సీట్లు కూడా నిండని పరిస్థితి నెలకొంది. దీంతో కాలేజీల యాజమాన్యాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి.