రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఈ నెల 28 వరకు జరుగనున్నాయి. అయితే ఈ సందర్భంగా మొత్తం 18 పనిదినాలు కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సమావేశాల్లో కొన్ని ముఖ్యమైన విషయాలపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి వీలుగా అజెండా రూపొందించబడినది అని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇందులో భాగంగా ముఖ్యమైన రెవెన్యూ కొత్త చట్టంపై రెండురోజులపాటు చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చర్చ అనంతరం రెవెన్యూ కొత్త చట్టం పై కొన్ని మార్పుచేర్పులను చేయబోతున్నారు.
సోమవారం అసెంబ్లీ సమావేశానంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రతిరోజు గంటపాటు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు . అరగంట పాటు జీరో అవర్ చేపడుతారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురానున్నందున, బిల్లుపై రెండు రోజుల పాటు చర్చ కొనసాగబోతోంది. ఇక, మంగళవారం నాటి ప్రశ్నోత్తరాలను రద్దు చేయడం జరిగింది. ఈ రోజు మాజీ ప్రధాని పీవీ నరసింహరావు శతజయంతి సందర్భంగా చర్చ, భారత రత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రస్తావిస్తూ అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులైనా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నదని, ఎటువంటి అభ్యంతరాలు లేవని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని కరోనా వ్యాప్తికి సంబంధించిన విషయాలను, ప్రజా సమస్యలు, మరియు ప్రభుత్వ పథకాలపై పూర్తిస్థాయిలో విపులంగా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. అంతేకాదు ప్రభుత్వం అందించనున్న ప్రతి పథకాన్ని ప్రజలకు చేరవేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను రూపుమాపడానికి చేయగలిగిన ప్రతి ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున లఘుచర్చకు 16 అంశాలను ప్రతిపాదించామన్నారు. సభలోని సభ్యుల సంఖ్యకు అనుగుణంగా చర్చ సమయాన్ని కేటాయించాలని స్పీకర్ కోరినట్టు వ్యక్త పరిచారు. మీరు ప్రసంగ అనంతరం ఎంఐఎం పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ సభా నాయకుడు చేసిన సూచనలతో ఏకీభవిస్తున్నట్లు తెలియజేశారు. కాగా శాసనసమండలి సమావేశాలను కూడా 18 రోజుల పాటు నిర్వహించనున్నారు. మంగళవారం మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని, శతజయంతి ఉత్సవాలపై చర్చకు సర్వం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే శాసనమండలి బీఏసీ సమావేశం చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది.