శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బంది అగ్ని ప్రమాదానికి బలైన ఘటనలో బాధిత కుటుంబాలకు పరిహారం అందించే విషయంలో కేసీఆర్ ప్రభుత్వంపై ఇటీవల వరకూ నిందలు పడ్డాయి. కేవలం 25లక్షల పరిహారంతోనే సరిపెట్టారంటూ చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు సిద్ధమైంది. ప్రభుత్వం తరపున ఇచ్చే పాతిక లక్షల పరిహారానికి తోడు, ఏపీ జెన్ కో 75లక్షల నష్టపరిహారం ఇస్తామని ముందుకొచ్చింది. దీంతో బాధిత కుటుంబాలకు అందే మొత్తం కోటి రూపాయలకు చేరింది. ఉద్యోగుల కుటుంబాలకు ఇది ఆర్థిక భరోసాని ఇస్తుందని అంటున్నారు అధికారులు, నేతలు. ఇంత భారీ మొత్తంలో ఆర్థిక సాయం ప్రకటించడం వెనక సీఎం జగన్ పరోక్ష పాత్ర కూడా ఉందని చెబుతున్నారు.
గతంలో విశాఖలో విషవాయువుకి బలైనవారి కుటుంబాలకు సీఎం జగన్ ఉదారంగా కోటి రూపాయల ప్రభుత్వ సాయాన్ని అందించారు. ఘటన జరిగిన రోజే పరిహారంపై ప్రకటన చేసి రోజుల వ్యవధిలోనే బాధిత కుటుంబాలకు అందించిన ఘనత వైఎస్ జగన్ ది. అప్పటి వరకూ ఏపీలో అంత భారీ మొత్తంలో ఎవరికీ పరిహారం అందించలేదనేమాట వాస్తవం. అయితే నష్ట పరిహారాన్ని కంపెనీ వద్ద తీసుకున్నారా లేక ప్రభుత్వమే తన ఖజానా నుంచి ఇచ్చిందా అనే విషయంలో స్పష్టత లేదు. ఏదేమైనా జగన్ ఉదారతను మాత్రం రాష్ట్ర ప్రజలు వేనోళ్ల కొనియాడారు. అప్పటి వరకూ 10లక్షలు, 20లక్షలు పరిహారం ఇవ్వాలంటూ గొడవ చేసిన ప్రతిపక్షాల నోళ్లు మూతపడ్డాయి.
శ్రీశైలంలో ప్రమాదం జరిగిన సమయంలో 9మంది మరణించారు. వీరిలో డిప్యూటీ ఇంజినీర్ ఒకరు. ఆయన కుటుంబానికి 50లక్షలు పరిహారం ప్రకటించిన కేసీఆర్ సర్కారు, మిగతా వారికి కేవలం పాతిక లక్షలు ఇవ్వజూపడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఏపీలో జగన్ కోటి రూపాయల పరిహారాన్ని గుర్తు చేసి మరీ కేసీఆర్ నిర్ణయాన్ని తప్పుబట్టాయి. దీంతో కొంత సమయం తర్వాత ప్రభుత్వం మరో ప్రతిపాదనతో ముందుకొచ్చింది. జెన్ కో తరపున 75లక్షల పరిహారం అందిస్తూ.. ఆ మొత్తాన్ని కోటి రూపాయలకు పెంచింది. ఏపీలో జగన్ తీసుకున్న నిర్ణయం వల్లే కేసీఆర్ కూడా తెలంగాణలో కోటి రూపాయల పరిహారం ఇవ్వాల్సి వచ్చిందని, బాధిత కుటుంబాలకు భరోసా లభించినట్లయిందని అంటున్నారు.