చైనా నిజంగా పశ్చాత్తాపపడుతుందా..?
మన దేశంపై ఎపుడూ కుయుక్తులు పన్నే డ్రాగన్ కంట్రీ చేసిన తప్పు తెలిసివచ్చినట్టు కనిపిస్తోంది. గాల్వాన్ ఘటనపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ శాంతివచనం అల్లుతోంది. ఇలాంటి ఘటనల్ని ఇరు దేశాలూ కోరుకోవడం లేదని భారత్‌లోని ఆ దేశ రాయబారి సన్ వీడాంగ్ అన్నారు. 'ఇండియా-చైనా యూత్ ఫోరం' నిర్వహించిన వెబినార్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ఇపుడు చర్చనీయాంశమైంది. గల్వాన్ లాంటి దురదృష్టకర ఘటనలు మరోసారి జరుగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందుకు సంబంధించి అన్నిరకాల చర్యలకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు.
ఘటన తర్వాత నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు చైనా చెబుతోంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్, చైనా మధ్య పరస్పర సహకారం ఎంతో అవసరమని వీడాంగ్ అభిప్రాయపడ్డారు. వివాదాలకు స్వస్తి పలికి అభివృద్ధి దిశగా సాగాల్సిన అవసరం ఉందన్నారు.
ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా సరిహద్దు వివాదాల్ని సైతం పరిష్కరించుకునేందుకు కృషి చేస్తామని చైనా చెబుతోంది. చైనా దురాక్రమణ తర్వాత భారత్‌లో పెరిగిన స్వయం సమృద్ధి నినాదాన్ని సన్ వీడాంగ్ పరోక్షంగా ప్రస్తావించారు. ఏ దేశమూ ఒంటరిగా అభివృద్ధి సాధించడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. ప్రపంచీకరణ యుగంలో స్వయం సమృద్ధి సాధిస్తూనే ఇతరులకు అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
మొత్తానికి డ్రాగన్ కంట్రీలో మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. మరి ఆ దేశం నిజంగా పశ్చాతప పడుతోందా.. లేక నటిస్తుందా అనేది తెలియాలి. అదీ గాల్వాన్ ఘటన జరిగి రెండు నెలలకు పశ్చాతపపడటంపై ఇపుడు సర్వత్రా చర్చకు దారితీస్తోంది. చూద్దాం.. అది నిజమైన మార్పా.. లేక నటన అనేది తెలియాల్సి ఉంది.