ఢిల్లీ, యూపీలో కొనసాగుతున్న హై అలర్ట్..!
ఢిల్లీ, యూపీ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర పన్నిన ఐసిస్ ఉగ్రవాది హస్తినలో అరెస్ట్ అయ్యాడు. ఐసిస్ ఉగ్రవాది అబూ సయీఫ్ ను ఢిల్లీ స్పెషల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాది దగ్గర గన్ తో పాటు రెండు ఐఈడీలు స్వాధీనం చేసుకున్నారు. ప్రెజర్ కుక్కర్ ను ఐఈడీగా మార్చినట్టు తెలుస్తోంది.
ఢిల్లీలో దౌలాకువా ప్రాంతంలో శుక్రవారం అర్థరాత్రి కాల్పులు జరిగాయి. పక్క సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులపై ఉగ్రవాది కాల్పులు జరపడంతో.. పోలీసులు కూడా ఫైరింగ్ చేశారు. కొంతసేపు ఎదురుకాల్పుల తర్వాత ఐసిస్ ఉగ్రవాది అబూ సయీఫ్ పట్టుబడ్డాడు. ఢిల్లీలో పలు చోట్ల రెక్కీ నిర్వహించినట్టు విచారణలో తేలింది. దీంతో హుటాహుటిన ఢిల్లీతో పాటు యూపీ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ నుంచి యూపీకి వెళ్లే వాహనాల్ని చెక్ పోస్టుల దగ్గర తనిఖీలు చేశారు.
ఉగ్రవాది అబూ సయీఫ్ తనది యూపీ బలరాంపూర్ అని చెప్పడంతో.. ప్రత్యేక బలగాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. అక్కడ అణువణువూ జల్లెడ పడుతున్నాయి. ప్రతి ఇంటినీ గాలిస్తున్నాయి. ఐసిస్ సానుభూతిపరుల కోసం ఆరా తీస్తున్నాయి. ఉగ్రవాది అరెస్ట్ కాగానే బాంబ్ డిస్పోజబుల్ స్క్వాడ్ లు రంగంలోకి దిగి.. ఐఈడీలను నిర్వీర్యం చేశాయి. అటు ఎన్ఎస్జీ కమాండోలు కూడా సీన్ లోకి వచ్చారు. ఉగ్రవాది అబూ సయీఫ్ అప్ఘనిస్థాన్ కమాండర్ల ఆదేశాలు పాటిస్తున్నట్టు సమాచారం. ఇటు కశ్మీర్ టెర్రరిస్టులతోనూ అతడికి సంబంధాలున్నట్టు తెలుస్తోంది.
అబూ సయీఫ్ అరెస్ట్ తర్వాత ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, బలరాంపూర్ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. ఉగ్రవాది ఢిల్లీలో పలు ప్రాంతాల్లో దాడులకు రెక్కీ నిర్వహించినట్టు తేలడంతో.. హై అలర్ట్ ప్రకటించారు. కొద్దిరోజుల క్రితం బెంగళూరులో అరెస్టైన డాక్టర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా.. ఢిల్లీలో ఉగ్రవాది ఆచూకీ తెలిసింది. బెంగళూరు డాక్టర్ కు కూడా ఐసిస్ తో లింకులున్నాయి. అంతకుముందు ఢిల్లీలో ఐసిస్ కు పనిచేస్తున్న దంపతులు అరెస్టైన తర్వాత ఇచ్చిన సమాచారంతో.. డాక్టర్ ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. మొత్తం మీద దేశవ్యాప్తంగా ఐసిస్ కు పనిచేస్తున్న స్లీపర్ సెల్స్ పై అటు ఎన్ఐఏ.. ఇటు ఢిల్లీ పోలీసులు ఆరా తీస్తున్నారు.