విద్యార్థులకు జగన్ సర్కార్ షాక్.... దసరా, సంక్రాంతి సెలవుల కుదింపు...?
విద్యార్థులపై ఒత్తిడి పడకూడదనే ఉద్దేశంతో జగన్ సర్కార్ సిలబస్ ను 30 శాతం తగ్గించింది. నూతన అకాడమిక్ క్యాలండర్ ప్రకారం 181 రోజులు మాత్రమే ఈ విద్యా సంవత్సరానికి పని దినాలు ఉంటాయి. కరోనా, లాక్ డౌన్ వల్ల విద్యార్థులు జూన్, జులై, ఆగష్టు నెలల పనిదినాలను నష్టపోయారు. దీంతో ఈ పనిదినాలను పండుగ సెలవుల కుదింపు ద్వారా భర్తీ చేయాలని జగన్ సర్కార్ భావిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రభావం దసరా, సంక్రాంతి పండుగ సెలవులపై పడనుంది.
ప్రభుత్వం దసరా పండుగకు అక్టోబర్ 22 నుంచి 26 వరకు ఐదు రోజులు, క్రిస్మస్కు డిసెంబర్ 24 నుంచి 28 వరకు, సంక్రాంతి పండుగకు 2021 జనవరి 12 నుంచి జనవరి 17 వరకు, వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు ఇచ్చింది. అకాడమిక్ క్యాలండర్ ప్రకారం 1 వ తరగతి నుంచి 5 వ తరగతి వరకు విద్యార్థులకు మొత్తం 8 పీరియడ్స్ ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి వరకు తరగతులు జరుగుతాయి.
పాఠశాలలు ప్రారంభమైన రోజే ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన కిట్లను ఇవ్వనుంది. జగన్ సర్కార్ వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్ కేజీ, యూకేజీ విద్యను ప్రారంభించనుంది. సీఎం జగన్ ఇప్పటికే ప్రీ ప్రైమరీ విద్య కోసం ప్రత్యేక సిలబస్ రూపొందించాలని... అవాసరమైన టీచర్ల నియామకాన్ని చేపట్టాలని... స్కూళ్ల పక్కనే అంగన్ వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.