నేనా... ప్రియాంకా వర్గమా ? రేవంత్ ఘాటు లేఖ ?

సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారంపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీలోనే తనపై కొంతమంది కుట్ర పన్నుతున్నారనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. కొద్ది రోజులుగా అదేపనిగా సోషల్ మీడియాలో తనకు సంబంధించి వ్యతిరేక కథనాలు వస్తున్నాయని ఆరోపించారు. తాజాగా కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ వర్గంలో తాను చేరినట్లు, ఆమె నాయకత్వాన్ని తాను ప్రమోట్ చేస్తున్నట్లుగా, సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుండడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కథనాలు పూర్తిగా నిరాధారమైనవని, ఆ ప్రచారాన్ని తాను ఖండిస్తున్నానని అన్నారు.

అసలు కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి వర్గాలకు తావులేదని, తామంతా సోనియా, రాహుల్ నాయకత్వంలో సమర్థవంతమైన ప్రతిపక్షంగా, ప్రజల పక్షాన పోరాడేందుకు ముందుకు వెళ్తున్నామని, కొంతమంది కావాలనే రాజకీయ దురుద్దేశంతోనే ఈ విధంగా తనపై అసత్య కథనాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది అత్యుత్సాహంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, ఇటువంటి పోస్టులు కారణంగా తనకు, పార్టీకి నష్టమే తప్ప, ఎటువంటి లాభం ఉండదని చెప్పుకొచ్చారు. తనపై అభిమానంతో కొంతమంది ఈ రకంగా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టినా, అది తనకు, పార్టీకి ఇబ్బంది కలిగించే అంశం అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా రేవంత్ తన రాజకీయ ప్రత్యర్ధులకు సంబంధించి ఓ సవాలు విసిరారు. నా ఎదుగుదలను గిట్టని వారికి, రాజకీయ ప్రత్యర్ధులకు తాను ఒకటే చెప్పదలచుకున్నా అని, నేరుగా మీరు చేసే దాడికి విమర్శలకు సమాధానం చెబుతాను. నా వ్యక్తిత్వాన్ని నా విశ్వసనీయతను దెబ్బతీసేందుకు దురుద్దేశపూర్వకంగా దొడ్డిదారిలో ఇటువంటి ప్రచారాలకు పూనుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దీనికి సంబంధించి ఓ లేఖను కూడా ఆయన విడుదల చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: