తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కుంభవృష్టి..!
గత కొద్దిరోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో వరంగల్ జిల్లా జలమయమైంది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.
నగరంలోని దాదాపు 60 కాలనీలు ముంపునకు గురయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారంలో ఉండిపోయారు. తినడానికి తిండి, తాగడానికి నీరు లేక నాలుగు రోజులుగా అవస్థలు పడుతున్నామని బాధితులు వాపోతున్నారు. ముంపు ప్రాంతాల్లో నగర మేయర్ పర్యటించారు. నీళ్లలో చిక్కుకున్న బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ డీఆర్ఎప్ టీమ్‌తో పాటు విజయవాడ నుండి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు.... వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాయి. బాధితులను బోట్స్ సహాయంతో బయటకు తీసుకొస్తున్నాయి రెస్క్యూ టీమ్స్.
కుండపోత వర్షాలతో పలు చోట్ల రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రహదారులపై పెద్ద ఎత్తున నీరు చేరడంతో, ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి. శిథిలావస్థకు చేరిన కొన్ని ఇళ్లు కూలిపోతున్నాయి. కిలా వరంగల్ పడమర కోటలో ఓ ఇల్లు కూలి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మృతి చెందారు.
మహబూబాబాద్ జిల్లా లక్ష్మీపురం గ్రామానికి నిండు గర్భిణికి పోలీసులు అపన్న హస్తం అందించారు. గర్భిణీ మహిళను ట్రాక్టర్ ద్వారా వాగు దాటించి నర్సంపేట్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ములుగు జిల్లా అబ్బాయిగుడెం గ్రామంలోనూ వాగు పొంగిపొర్లుతుండడంతో ఓ గర్భిణీ మహిళకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎట్టకేలకు రెవెన్యూ అధికారులు ఆమెను మరపడవ సాయంతో వాగు దాటించి ఆస్పత్రికి తరలించారు.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో ఆకెరువాగులో కొట్టుకుపోతున్న ఇద్దరు రైతులను....పోలీసులు, స్థానికుల సహాయంతో రెండు గంటల పాటు శ్రమించి రక్షించారు. నిలువ నీడ కోల్పోయి కొందరు, పంటలు దెబ్బతిని మరికొందరు..ఇలా వర్షాల ధాటికి అతలాకుతలమవుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.