ఈ సారి స్వాతంత్ర్య దినోత్సం ఇలా జరుగనుంది.. !
కోవిడ్ కారణంగా స్వాతంత్ర్యదినోత్సవం కోసం ఎర్రకోటలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది రక్షణ శాఖ. ఒకవైపు మహమ్మారి బారిన పడకుండా ముందుజాగ్రత్తలు తీసుకుంటూనే జాతీయ ఉత్సవ పవిత్రతకు, గౌరవానికి భంగం కలుగకుండా చూస్తున్నారు అధికారులు. ఎక్కడా ఎలాంటి అంతరాయం లేకుండా, ఆహ్వానితులు ఏమాత్రం గుమికూడకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆహ్వానితులందరూ తమకు కేటాయించిన స్థానాలకు సులభంగా.. వెళ్లేందుకు వీలుగా ప్రతిచోటా మెటల్ డిటెక్టర్లతో అదనపు ద్వారాలు ఏర్పాటు చేశారు.
గౌరవ వందనం సమర్పించే బృందం సభ్యులను భద్రత రీత్యా ముందుగానే "క్వారెంటైన్"లో ఉంచింది రక్షణశాఖ. సీట్ల ఏర్పాటు, అమరికకు సంబంధించి "రెండు గజాల దూరం" ఉండాలన్న నియమాన్ని పాటించారు. స్వాతంత్య్ర దినోత్సవాలకు ఆహ్వానం ఉన్న వారిని మాత్రమే అనుమతించనున్నారు అధికారులు. ఇప్పటికే అధికారులు, దౌత్యవేత్తలు, ప్రజలు, మీడియా తదితరులకు దాదాపు 4 వేల ఆహ్వానాలు పంపారు.
తెలంగాణ ప్రభుత్వం కరోనా ఉన్నప్పటికీ స్వాతంత్ర్య దినోత్సవం జరపాలని డిసైడైంది. హైదరాబాద్‌తో పాటూ... మిగతా 32 జిల్లాల్లో జిల్లా కేంద్రాల్లో ఈ వేడుక జరగనుంది. రాష్ట్రవ్యాప్త వేడుక హైదరాబాద్‌లో జరగనుంది. ఉదయం 10.30కి ముఖ్యమంత్రి కేసీఆర్... జాతీయ జెండాను ఎగరవేస్తారు. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఏ జిల్లాల్లో ఏ మంత్రులు జెండా ఎగరవేయాలో ఓ ఆర్డర్ జారీ చేసిన ప్రభుత్వం... జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఉదయం 10 గంటల సమయంలో జెండా వందనం జరగాలని తెలిపింది. ఎమ్మెల్యేలు, మేయర్లు ఇతరతా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించింది.
ఇక ఏపీలో.. ఇందిరాగాంధీ స్టేడియంలో ముఖ్యమంత్రి జగన్ ఉదయం తొమ్మిది గంటలకు జాతీయ జెండా ఎగురవేస్తారు. స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు డీజీపీ గౌతమ్ సవాంగ్. అన్ని ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన ఆయన.. కరోనా వల్ల తక్కువ సంఖ్యలో మాత్రమే ఆహ్వానాలుంటాయన్నారు. రాష్ట్రంలో వివిధ శాఖలకు చెందిన 10 శకటాలు మాత్రమే ర్యాలీ చేయనున్నాయి.
కరోనా వైరస్ ఉంది కాబట్టి... పంద్రాగస్టు వేడుకల్లో అందరూ తప్పని సరిగా మాస్క్ పెట్టుకోవాలనీ, సోషల్ డిస్టాన్స్ పాటించాలనీ, శానిటైజర్లు, శానిటైజర్ స్ప్రేలను అందుబాటులో ఉంచాలనీ తెలిపాయి ప్రభుత్వాలు. అలాగే... వేడుకల్లో కొద్ది మంది ముఖ్యమైన వారు మాత్రమే పాల్గొనాలని కూడా చెప్పింది.