మన దేశంలో వరణుడి ప్రభావం ఎలా ఉందంటే.. !
వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో ఎటు చూసినా వర్షపు నీరే కనిపిస్తోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఢిల్లీ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఈ వర్షాకాలంలో ఈ స్థాయిలో వర్షం కురవడం ఇదే తొలిసారి.
ఇక ఢిల్లీలోని ఆయానగర్ వెదర్ స్టేషన్ ప్రాంతంలో అత్యధికంగా 10 సెంటీ మీటర్ల వర్షాపాతం నమోదైంది. పాలంలో 9 సెంటీమీటర్లు, రిడ్జ్ వెదర్ స్టేషన్లో 8.4 సెంటీ మీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. ఢిల్లీ రైల్వే స్టేషన్, ద్వారకా అండర్‌పాస్ ప్రాంతాల వద్ద వాహనాలు నిలిచిపోయాయి.
జమ్మూకశ్మీర్‌లో వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాల ప్రభావంతో నదులు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. చీనాబ్ నది మహోగ్రంగా ఉరకలేస్తోంది. డేంజర్ మార్క్ దాటి ప్రవహిస్తుండడంతో నదీ పరివాహక ప్రాంతాలవారు బిక్కుబిక్కుమంటున్నారు. ప్రభావిత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఇటు ఉత్తరాఖండ్‌లోని చమోలీలో కురిసిన భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. నదులు ఉగ్రరూపం దాల్చాయి. వరదలకు రహదారులన్నీ జలమయం అయ్యాయి. చమోలీ చుట్టుపక్కల ప్రాంతాల్లో వేలాది ఇళ్లు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. చమోలీ, భద్రినాథ్ మధ్య హైవేపై కొండచరియలు విరిగిపడుతున్నాయి. అటు పితోర్గఢ్లోనూ కొండచరియలు విరిగిపడ్డాయి.
హిమాచల్‌ప్రదేశ్‌లో వానల జోరు క్రమంగా పెరుగుతోంది. సిమ్లా, కులూ సహా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వానలు పడుతున్నాయి. వరదలతో రోడ్లు దెబ్బతింటున్నాయి. ఇటు రాజస్థాన్‌లోనూ వరుణుడు బీభత్సం సృష్టించాడు. చురు సహా పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. భారీగా వర్షం పడడంతో ఇళ్లల్లోకి నీరు చేరింది. రోడ్లపై అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు.
మహారాష్ట్రపై వరుణుడు మరోసారి తన ప్రతాపం చూపిస్తున్నాడు.. పూణే-థానే-పాల్ఘర్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయ్. పూణేలో వరదనీటిలో పలు వాహనాలు చిక్కుకుపోయాయ్. కుండపోత వర్షాలకు ముంబైలో జనజీవనం స్తంభించింది. వర్షాలు, వరదలతో నానా అవస్థలు పడుతున్న ముంబైకర్లను ఈదురుగాలులు హడలెత్తించాయి.