ఏపీలో భూముల ధరలకు రెక్కలు..!

NAGARJUNA NAKKA
ఏపీ వ్యాప్తంగా భూముల ధరలు పెరిగాయి. మెజార్టీ ప్రాంతాల్లో 20 నుంచి 30 శాతం మేర ధరలను పెంచారు. కానీ రాజధాని అమరావతి ప్రాంతంలో మాత్రం భూముల ధరలు పెరగలేదు. 29 గ్రామాల పరిధిలోని నాలుగు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల పరిధిలో భూముల ధరలను పెంచకూడదని సర్కార్‌ డిసైడ్‌ చేసింది.

ఏపీకి ఆదాయం సమకూర్చుకునే దిశగా జగన్‌ సర్కార్‌ కసరత్తు చేస్తోంది. దీంట్లో భాగంగా ఆదాయ మార్గాలను అన్వేషించే పనిలో పడింది. ఈ క్రమంలో భూముల ధరలను పెంచుతూ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. ప్రజల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుని భూముల ధరలను పెంచింది ప్రభుత్వం. ఈ మేరకు పెరిగిన భూముల ధరలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల పరిధిలోని భూములను పెంచుతూ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రాజధాని పరిధిలో భూముల ధరలను పెంచుతారని అంతా భావించారు. కానీ ప్రభుత్వం దీనికి భిన్నంగా ఆలోచన చేసింది. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో భూముల ధరలను పెంచకూడదని సర్కార్‌ నిర్ణయించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా భూముల ధరలు పెరిగినా.. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో మాత్రం భూముల ధరలు పెరగలేదు.

రాజధాని పరిధిలోని 29 గ్రామాలకు నాలుగు సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. తుళ్లూరు, మందడం, అనంతవరం, ఎర్రబాలెం గ్రామాల్లో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు ఉన్నాయి. ఈ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో రాజధాని గ్రామాల్లో గజం భూమి ధర ఐదు వేల రూపాయలుగా ఫిక్స్‌ చేసింది ప్రభుత్వం. గతంలో రాజధాని రాకముందు భూముల ధరలు ఎకరాలకు లెక్క కట్టేవారు. కానీ రాజధాని ప్రకటన తర్వాత గజాల చొప్పున లెక్క కడుతుండడంతో ప్రభుత్వం గజానికి ఐదు వేలుగా ఫిక్స్‌ చేసింది. రాజధాని రాకముందు మెట్ట ప్రాంతాల్లో ఎకరం ధర ఐదు లక్షలుగా ఉంటే.. జరీబు ఎనిమిది నుంచి 12 లక్షల మధ్యగా అన్నట్టుగా ప్రభుత్వ భూముల ధరల ఉండేవి. ప్రస్తుతం రాజధాని పరిధిలో ప్రభుత్వం ఫిక్స్‌ చేసిన భూముల ధరలు ఎక్కువగానే ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోన్నట్టు సమాచారం. దీంతో మరింతగా ధరలను పెంచితే భారంగా పరిణమిస్తుందని ప్రభుత్వం అంచనాకు వచ్చినట్టు కనిపిస్తోంది.

కొంత కాలంగా జరుగుతున్న పరిణామాలతో రాజధాని పరిధిలో కూడా రియల్‌ ఎస్టేట్‌ ప్రభావం అంతగా లేదనే చెప్పాలి. భూముల క్రయ విక్రయాలు కూడా చాలా వరకు తగ్గిపోయాయి. గతంలో రాజధాని పరిధిలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఎప్పడు చూసినా కళకళలాడుతూ ఉండేవి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. రియల్‌ ఎస్టేట్‌ పడిపోయిందనడానికి ఇదే నిదర్శనమని చెప్పాలి. ఈ పరిస్థితుల్లో భూముల ధరలు పెంచితే ఆదాయాన్ని మరింతగా కొల్పోవాల్సి వస్తుందనే భావన కూడా ప్రభుత్వంలో కన్పిస్తోంది. వీటిన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాజధాని పరిధిలోని 29 గ్రామాల పరిధిలో భూముల ధరలను ప్రభుత్వం పెంచలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: