తెలంగాణ కరోనా రోగులకు శుభవార్త... ఈ ఆస్పత్రిలో రూ.28 వేలకే వైద్యం...?
నిబంధనలకు విరుద్ధంగా పలు ఆస్పత్రులు కరోనా రోగుల నుంచి భారీ మొత్తంలో బిల్లుల రూపంలో వసూలు చేస్తున్నాయి. తెలంగాణ సర్కార్ నిబంధనలకు విరుద్ధంగా భారీ మొత్తం వసూలు చేసిన రెండు ప్రైవేట్ ఆస్పత్రులకు ఇప్పటికే షాక్ ఇచ్చింది. నగరంలో చాలామంది ప్రజలు కరోనా నిర్ధారణ అయితే ప్రభుత్వ ఆస్పత్రులతో పోలిస్తే ప్రైవేట్ ఆస్పత్రులు మెరుగైన సౌకర్యాలను అందిస్తాయని భావిస్తున్నారు.
అయితే ఇలాంటి సమయంలో జైన్ ఇంటర్నేషనల్ సంస్థ వంద పడకల కోవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేసి కేవలం 28 వేల రూపాయలకే బాధితులకు చికిత్స అందించేందుకు సిద్ధమైంది. దాతల సహకారంతో సేవలందించే ఈ ఆస్పత్రి తక్కువ ఫీజులతోనే కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ ఉండటం గమనార్హం. జైన్ ఇంటర్నేషనల్ కరోనా బాధితులను ఆదుకునేందుకు దేశవ్యాప్తంగా 15 కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసింది.
హైదరాబాద్ లోని బేగంపేట చిరాగ్‌పోర్ట్‌లోని మూడు అంతస్థుల మానస సరోవర్ హోటల్‌లో నిన్న ఈ కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభమైంది. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం ఈ ఆస్పత్రిలో వైద్య సేవలు అందుతాయి. వారానికి ఒక వ్యక్తికి 28 వేల రూపాయలతో ఈ ఆస్పత్రిలో వైద్యం అందుతుంది. కరోనా మందులు, ఆక్సిజన్ తదితర సదుపాయాలకు అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవాళ్ల విషయంలో సిబ్బంది ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజులుగా రెండు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.