కేంద్ర మార్గదర్శకాలకు కేసీఆర్ ఓకే చెప్పినట్టేనా..?

NAGARJUNA NAKKA
పరీక్షలు, విద్యా సంవత్సరం ప్రారంభం, ఆన్ లైన్ తరగతుల విషయంలో కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ముందుకు పోవాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. ప్రతీ విషయం కోర్టులో వివాదం అవుతుండటంతో.. ప్రభుత్వం ఈ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కోర్ట్ కు సమర్పించిన రిపోర్ట్ లోనే కాదు విద్యా శాఖ అంతర్గత సమావేశాల్లోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్టు సమాచారం.


కరోన ప్రభావం ఇప్పట్లో తగ్గేలా లేదు. దీంతో విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియని పరిస్థితి. కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలు ఆన్ లైన్ క్లాసులు చెబుతున్నా.. అవికూడా తూతూ మంత్రంగానే సాగుతున్నాయి. ఉన్నత విద్యకు సంబంధించి పలు పరీక్షలు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కానీ తెలంగాణ సర్కార్‌ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఏ నిర్ణయం తీసుకున్నా కోర్టు కేసుల రూపంలో ఇబ్బందులు ఎదురవుతుండటంతో.. ఈ విషయంలో తొందర పడొద్దని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం మార్గ దర్శకాలకు అనుగుణంగా వెళ్లాలనుకుంటోంది. రీసెంట్ గా సీఎం దగ్గర జరిగిన సమావేశంలో ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. సీఎం కూడా కేంద్ర గైడ్ లైన్స్, ఇతర రాష్ట్రాలు అవలంభిస్తున్న విధానాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్‌ సూచించినట్టు తెలుస్తోంది.


ఈ నెల 22 న తుది నిర్ణయం వెల్లడిస్తామని.. కోర్టుకు విన్నవించిన ప్రభుత్వం.. విద్యాసంస్థలు ఎప్పుడు ప్రారంభించాలనే అంశంపై కేంద్రం అభిప్రాయాలను కోరినట్టు తెలిపింది. ఉన్నత విద్యకు సంబంధించి...  డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ పరీక్షల్ని రద్దుచేసి విద్యార్థులను ప్రమోట్ చేయాలని భావించిన ప్రభుత్వం.. ఆ తర్వాత యూజీసీ రివైజ్డ్ గైడ్ లైన్స్ ఇవ్వడంతో .. వాటి ప్రకారమే ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. డీఈఓలతో పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ నిర్వహించిన కాన్ఫరెన్స్ లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. కేంద్ర గైడ్ లైన్స్ ప్రకారమే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని.. ఆన్ లైన్ తరగతులకు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది. మొత్తానికి అనవసర వివాదాలకు తావులేకుండా.. కేంద్రం చెప్పినట్టు ముందుకు వెళ్లాలనే యోచనలో రాష్ట్ర సర్కార్‌ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: