యువత ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని నూతన విద్యా విధానం రూపుదిద్దుకుంది: మోదీ

Reddy P Rajasekhar
ప్రధాని నరేంద్ర మోదీ నేడు స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2020 లో మాట్లాడుతూ కరోనా వైరస్ విపత్కర పరిస్థితుల్లో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్-2020 నిర్వహించడం సవాల్ అని అన్నారు. వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఈ విధమైన కార్యక్రమాలను జరపడం విశేషమని పేర్కొన్నారు. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలేలో కాలేజీలు, వివిధ యూనివర్సిటీల విద్యార్థులను ఉద్దేశించి మోదీ మీడియాతో మాట్లాడారు.

 
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థులతో మోదీ ఇంటరాక్ట్ అయ్యారు. మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన గ్రాండ్ ఫినాలేకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి తోడ్పడతాయని చెప్పారు. ఇంత భారీగా ఆన్ లైన్ ద్వారా హ్యాకథాన్ నిర్వహించడం చెప్పుకోదగిన విషయమని... యువతకు గతంతో పోలిస్తే బాధ్యత పెరిగిందని చెప్పారు.
 
21వ శతాబ్దంలో పరిశోధన, ఆవిష్కరణలపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని... జాతీయ విద్యా విధానం ఇందుకోసం దోహదపడుతుందని తెలిపారు. యువత ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని నూతన విద్యా విధానం రూపుదిద్దుకుందని చెప్పారు. నూతన విద్యా విధానం విద్యార్థులకు బ్యాగుల భారాన్ని తగ్గిస్తుందని... జీవితానికి ప్రయోజనం చేకూరేలా ఈ విద్యా విధానం ఉంటుందని అన్నారు.

 విద్యా విధానంలో తీసుకువచ్చిన మార్పుల వల్ల భారతదేశ భాషలు మరింత అభివృద్ధి చెందుతాయని... నూతన విద్యా విధానం భారతదేశ జ్ఞానాన్ని పెంచడమే కాక దాని ఐక్యతను కూడా పెంచుతుందని చెప్పారు. 7 ప్రభుత్వ శాఖలు, 17 రాష్ట్ర ప్రభుత్వాలు, 20 పరిశ్రమలకు సంబంధించి 243 ప్రశ్నలను పరిష్కరించేందుకు సుమారు పది వేల మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పోటీ పడనున్నారు. మరో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: