రైతులకు మరో శుభవార్త చెప్పిన జగన్ సర్కార్...?

Reddy P Rajasekhar
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 14 నెలల పాలనలో రైతులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు వాళ్ల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్పత్తిదారుల సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు 40 శాతం రాయితీపై వ్యవసాయ పరికరాలను పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది.
 
ఏపీ సహకార బ్యాంక్ ఆర్థిక సహాయంతో సంఘాలు ఈ పరికరాలకు సమకూర్చుకోవచ్చు. వ్యవసాయ పరికరం విలువలో సంఘాలు 10శాతం నిధులను సమకూర్చుకోవాల్సి ఉండగా బ్యాంకులు 50 శాతం రుణంగా ఇస్తాయి. మిగిలిన 40 శాతం ప్రభుత్వం రాయితీగా ఇస్తుంది. గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ పరికరాల పంపిణీలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఆ అక్రమాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం వ్యవసాయ పరికరాల పంపిణీలో అనేక మార్పులు చేర్పులు చేసింది.
 
ఏపీ సహకార బ్యాంక్ తొలిదశలో పేర్కొన్న సంఘాలకు మొదట నిధులను కేటాయించనుంది. ప్రభుత్వం నుంచి ఈ మేరకు నిన్న మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఆసక్తి ఉన్న రైతులు ఈ నెల 15వ తేదీలోగా సంఘాలను ఏర్పాటు చేసుకోవాలి. గ్రామ స్థాయి కమిటీలు ఈ సంఘాలను గుర్తించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే సంఘాలు గతంలో ఏ బ్యాంకులోనూ రుణ ఎగవేతదారుగా ఉండకూడదని ప్రభుత్వం నిబంధనల్లో స్పష్టం చేసింది.
 
ఏపీ సహకార బ్యాంకు నుంచి కనిష్టంగా రూ. 12 లక్షల నుంచి గరిష్టంగా రూ. 1.30 కోట్ల వరకు రుణం పొందవచ్చు. సంఘాలకు యాంత్రిక పరికరాల సరఫరా జరిగిన తరువాత మాత్రమే ప్రభుత్వం ఉత్పత్తిదారులకు రాయితీ మొత్తాన్ని జమ చేస్తుంది. తొలి దశలో భాగంగా ఈ సంవత్సరం ఒక గ్రామంలో ఒక సంఘానికే రాయితీపై రుణం అందుతుంది. అవసరమైన యాంత్రిక పరికరాలను ఎంపిక చేసుకునేందుకు సంఘాలకు మండల, జిల్లాస్థాయిలో ఉత్పత్తిదారులు ప్రదర్శనలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల నాలుగో వారం నుంచి వచ్చే నెల రెండవ వారం వరకు వ్యవసాయ యంత్రాల ప్రదర్శన జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: