మన దేశంలోకి కరోనా ప్రవేశించి సరిగ్గా ఆరునెలలు.. !

NAGARJUNA NAKKA
ఆరు నెలలు.. దేశంలో కరోనా వైరస్ ప్రవేశించి... ఈ రోజుకు సరిగ్గా ఆరు నెలలు గడిచాయి. దేశంలో తొలి కేసు జనవరి 30న కేరళలో నమోదయింది. వూహాన్‌ నుంచి వచ్చిన కేరళ విద్యార్థినికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ ఆరు నెలల కాలంలో కరోనా మహమ్మారి దేశంలో జడలు విప్పి వ్యాపించింది. పేద, ధనిక, చిన్న, పెద్ద, పండిత, పామర అనే తేడా లేకుండా...దేశంలోని నలుమూలలకూ వైరస్ ఊహించని రీతిలో వ్యాపించింది.  కరోనా ప్రవేశించిన ఆరు నెలలకు ....దేశం అన్‌లాక్‌ 3లోకి అడుగుపెడుతోంది. ఈ ఆరు నెలల కాలంలో భారత్‌లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. మామూలుగా.. ఆరు నెలల కాలానికి... ఓ మనిషి జీవితకాలంలో...ఓ దేశ చరిత్రలో పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కానీ ఈ ఆరు నెలల కాలం మాత్రం రాష్ట్రం, దేశం, ప్రపంచం అన్న తేడాలేకుండా సమస్త మానవాళినీ కుదిపేసింది. వైరస్ కారణంగా గాడి తప్పిన జనజీవనం ఇంతవరకు కుదుట పడలేదు. ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని పతనావస్థకు చేరింది. నిరుద్యోగం రాజ్యమేలుతోంది. సామాన్యుడికి జీవితం పెను భారంగా మారింది. సకల వ్యవస్థలకూ కరోనా పూడ్చలేని నష్టాన్ని మిగిల్చింది. లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలు, ఉద్దీపన పథకాలు, అత్యవసర సాయాలు ఏవీ...ప్రజల జీవితాన్ని గాడిన పెట్టలేకపోతున్నాయి. మహమ్మారి విజృంభణ, ఊహించని రీతిలో పెరుగుతున్న కేసులు, భవిష్యత్తును భయాందోళనలో ముంచుతున్నాయి.


వైరస్ పుట్టిన చైనాతో పాటు ఇటలీ, స్పెయిన్ వంటి యూరప్ దేశాలు, అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కల్లోలం సృష్టిస్తున్న  సమయంలో...మిగిలిన దేశాలతో పోలిస్తే...కాస్త ఆలస్యంగా భారత్‌లో ప్రవేశించింది మహమ్మారి. దేశంలో తొలి కేసు నమోదయినపుడు...ఓ సంచలనం..భయం..తెలియని ఆందోళన....తొలి కేసు విషయం బయటకు రాగానే...దేశం యావత్తూ ఉలిక్కిపడింది. మన దాకా రాదనుకున్న మహమ్మారి....ముంగిట్లోకి ప్రవేశించగానే...అందరూ అప్రమత్తమయ్యారు. అయితే తొలి కేసు నమోదయినప్పటికీ...దేశంలో కరోనా వ్యాప్తిపై పెద్దగా అవగాహన లేదు. తెలీని భయం, అపోహలే అంతటా...కరోనా గురించి కచ్చితమైన సమాచారం తెలియకముందే...వైరస్ నెమ్మదిగా దేశంలో వ్యాపించడం మొదలయింది. తొలిరోజుల్లో భారత్‌లో రోజుకు  ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో యూరప్ సహా కొన్ని దేశాల్లో రోజూ వేల సంఖ్యలో కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతుంటే...భారత్ మాత్రం అత్యంత సురక్షిత దేశంగా కనిపించింది. దాదాపు రెండు నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగింది.


దేశంలో జనతా కర్ఫ్యూ విధించిన మార్చి 22కు అన్ని రాష్ట్రాల్లో కేసులు కలిపి 500లోపే ఉన్నాయి. జనతా కర్ఫ్యూకు, తదనంతర తొలివిడత లాక్‌డౌన్‌కు దేశం మొత్తం మద్దతు ప్రకటించింది. సాధ్యమైనంతమేర ఇళ్లల్లో నుంచి బయటకు రాకుండా ఉండేందుకు ప్రజలు ప్రయత్నించారు. అయితే ముందస్తు సమాచారం లేని లాక్‌డౌన్‌తో రోజువారీ కూలీలు, వలస కార్మికులు ఉపాధి లేక, నిలువ నీడ లేక, ముందు, ముందు ఏం జరుగుతోందో తెలియక స్వస్థలాలకు పయనమయ్యారు. స్వాతంత్ర్యం పూర్వ ముందులాగా మూటా ముల్లే సర్దుకొని సొంత ఊళ్లకు పయమనమైన బహుదూరపు బాటసార్లతో దేశంలోని రహదారులన్నీ నిండిపోయాయి. లాక్‌డౌన్‌తో పాటే దేశంలో వైరస్ వ్యాప్తి పెరుగుతూ వచ్చింది. రోజుకు పది కేసుల నుంచి ఆ సంఖ్య, వంద, వేలకు చేరింది. మే చివరి నాటికే..దేశంలో కరోనా పరిస్థితి అదుపుతప్పింది. ఇక లాక్‌డౌన్ ఎత్తివేత తర్వాత వైరస్‌కు అడ్డుకట్ట అన్నదే లేకుండా పోయింది. అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా విజృంభించింది. తొలి కేసు నమోదయిన కేరళలో కాస్త పరిస్థితి అదుపులోకొచ్చినప్పటికీ... వైరస్ ప్రభావం మొదటి నుంచీ అధికంగా ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ర్టాల్లో కేసులు, మరణాల సంఖ్య భయోత్పాతం కలిగిస్తోంది. దేశంలో లక్ష కేసులు నమోదుకావడానికి 109 రోజులు పడితే...ప్రస్తుతం రెండ్రోజుల్లో కొత్త కేసుల సంఖ్య లక్ష దాటుతోందంటే... వైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: