ఏపీలో అన్ని బాగానే ఉన్నాయ్.. కానీ శవాలకే మనశాంతి లేదు..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు పరిస్థితులు మారిపోతున్నాయి. రోజు విడిచి రోజు గడుస్తున్న కొద్దీ.. దినదినగండంగా మారిపోతుంది పరిస్థితి . ప్రతిరోజు రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. మొన్నటి వరకు అతి తక్కువ కరోనా కేసులు ఉన్న రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం... భారీ కేసులు ఉన్న రాష్ట్రాల పంచన చేరి పోయింది. అలాగని ప్రభుత్వ అసమర్థత అంటే కాదు అనే సమాధానం అటు ప్రజల నుండి వినిపిస్తోంది. ఎందుకంటే జగన్ సర్కార్ ప్రస్తుతం దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా అత్యధిక పరీక్షలు నిర్వహిస్తుంది.. అంతేకాకుండా క్వారంటైన్ కేంద్రాల నిర్వహణ కూడా జగన్ సర్కార్ బాగా చేస్తుంది. రోగులకు చికిత్స మందుల పంపిణీ విషయంలో కూడా జగన్ సర్కార్ చర్యలు సంతృప్తికరంగానే ఉన్నాయి అని చెప్పాలి.
కానీ ఒక్క విషయంలో మాత్రం జగన్ సర్కార్ చేపడుతున్న చర్యలు తూతూ మంత్రంగానే కనిపిస్తున్నాయి అన్న వాదన వినిపిస్తోంది. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమా అధికారుల నిర్లక్ష్యమా అన్నది పక్కన పెడితే... రోజురోజుకు మార్చురి లో శవాలు పేరుకుపోతున్నాయి. ఏ వ్యాధి వచ్చి చనిపోయిన వారి మృతదేహాలకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు... కరోనా పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు ఆలస్యంగా వస్తున్న నేపథ్యంలో రోజురోజుకు మార్చురిలో శవాల సంఖ్య పెరిగిపోతుంది. కొన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే సామర్థ్యానికి మించి శవాలను ఉంచాల్సిన అవసరం వచ్చింది.
ఒక శవం పైన ఇంకో శవం... దానిపైన ఇంకో శవం ఇలా మార్చురీలో మృతదేహాలను పేరుస్తున్నారు . కరోనా పరీక్షలు నిర్వహించి వాటి ఫలితాలు వచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించే సమయానికి ఏకంగా ఐదు రోజుల సమయం పడుతుంది. ఈలోగా వ్యక్తుల మృతదేహాలు కుళ్ళిపోతున్నాయి. అటు వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటుతూనే ఉన్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్ నియంత్రణ విషయంలో ఎంతో సమర్థవంతంగా ముందడుగు వేస్తున్న జగన్ సర్కార్.. మృతదేహాలకు కరోనా పరీక్షలు... వాటిని కుటుంబ సభ్యులకు అప్పగించే విషయంలో కూడా మరింత దృష్టిసారిస్తే కనీసం శవాల కైనా మనశ్శాంతి దొరుకుతుంది అని ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.