అన్ లాక్ 2.0 : కరోనా గురించి మరో షాకింగ్ న్యూస్... నెగిటివ్ వచ్చినా జాగ్రత్తగా ఉండాల్సిందే....?
ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి చిగురుటాకులా గజగజా వణికిస్తోంది. అన్ లాక్ 2.0 సడలింపుల తర్వాత దేశంలో రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతుగున్నాయి. కరోనా వైరస్ గురించి, వ్యాక్సిన్ గురించి శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తున్నారు. శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో ఎన్నో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక విషయం శాస్త్రవేత్తలు, పరిశోధకులను భయభ్రాంతులకు గురయ్యేలా చేస్తోంది. కరోనా లక్షణాలు కనిపించిన చాలామందికి పరీక్ష చేయించుకుంటే నెగిటివ్ నిర్ధారణ అవుతోంది. అయితే తర్వాత పాజిటివ్ నిర్ధారణ అవుతోంది.
దక్షిణ కొరియా, చైనాలో కొంతమందికి కరోనా పరీక్షలు చేసిన సమయంలో నెగిటివ్ నిర్ధారణ కాగా తర్వాత రోజుల్లో పాజిటివ్ నిర్ధారణ అయింది. వీళ్లలో మొదట స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో శాస్త్రవేత్తలు వైరస్ రోగి శరీరంలో నిద్రాణమై ఉంటుందని... సోకిన కొన్ని రోజుల తరువాత యాక్టివ్ అవుతుందని చెబుతున్నారు. కొందరు శాస్త్రవేత్తలు కరోనా ఒకసారి సోకితే మళ్లీ సోకదని చెబుతున్నా దక్షిణ కొరియాలో సోకిన వాళ్లకే వైరస్ సోకుతోంది.
మన దేశంలోని చెన్నైలో కూడా గత వారం ఇలాంటి రెండు కేసులే నమోదయ్యాయి. తమిళనాడులోని వెల్లూరులో పనిచేస్తున్న వైరాలజిస్ట్ ప్రొఫెసర్ టీ జాకబ్ మాత్రం కరోనా పరీక్షల్లోని లోపాల వల్లే నెగిటివ్ నిర్ధారణ అవుతూ ఉండవచ్చని తెలిపారు. కరోనా వైరస్ రెండోసారి సోకినట్లు కచ్చితమైన ఆధారాలు లేవని... కరోనా నిర్ధారణ కోసం అత్యుత్తమ పరీక్షగా పరిగణిస్తున్న ఆర్టీ పీసీఆర్ పరీక్షలో కూడా వంద శాతం ఖచ్చితత్వం లేదని... అప్పుడప్పుడూ ఫలితాలు తప్పుగా వస్తున్నాయని ఆయన తెలిపారు.
కాగా, కరోనా పరీక్షల్లో నెగిటివ్ నిర్ధారణ అయితే కరోనా లేనట్లు కాదని... రోగనిరోధక శక్తి ఉన్నవాళ్లలో సైతం వైరస్‌లు శ్లేష్మస్థాయిలో జీవించగలవని ప్రొఫెసర్ జాన్ తెలిపారు. మాస్కులు ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ మాత్రమే వైరస్ వ్యాప్తిని అడ్డుకునే అవకాశాలు ఉంటాయని ఆయన అన్నారు. మరోవైపు దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేవరకు ఇదే పరిస్థితి నెలకొంటుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.