ఏపీలో కరోనా మరణమృదంగం... రికార్డుస్థాయిలో కరోనా కేసులు....?
ఏపీని కరోనా వైరస్ గజగజా వణికిస్తోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా 8,000కు అటూఇటుగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 7,627 మందికి కరోనా నిర్ధారణ అయింది. కొత్తగా నమోదైన కేసులతో ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 93,403కు చేరింది. రేపు నమోదయ్యే కేసులతో ఏపీలో కరోనా బాధితుల సంఖ్య లక్ష మార్కును దాటే అవకాశం ఉంది.
వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పలు జిల్లాల్లో లాక్ డౌన్ ను అమలు చేస్తోంది. నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో, కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 48,915 యాక్టివ్ కేసులు ఉండగా 43,447 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలో ఐదు రెట్లు ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతూ ఉండటం గమనార్హం.
మరోవైపు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో 56 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 1,041కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 1,213 కేసులు నమోదు కాగా తూర్పుగోదావరి జిల్లాలో 1,095 కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి, కర్నూలు, గుంటూరు జిల్లాలలో పదివేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో వైరస్ విజృంభణ వల్ల ప్రజలు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్ భారీన పడుతున్నామని చెబుతున్నారు. అధికారులు కోవిడ్ 19 ఆంధ్రప్రదేశ్ యాప్ ద్వారా కరోనాకు సంబంధించిన పూర్తి సమాచారం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా వైరస్ వ్యాపిస్తోందని... ప్రజలు వైరస్ భారీన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.