శానిటైజర్లు వాడే వాళ్లకు షాకింగ్ న్యూస్....?

Reddy P Rajasekhar

దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతూ ప్రజలను గజగజా వణికిస్తోంది. కరోనా వైరస్ భారీన పడకుండా చాలా మంది హ్యాండ్ శానిటైజర్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే వీటిని అతిగా వాడినా ప్రమాదమేనని తాజాగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర దశకు చేరుకున్న తరుణంలో ఆరోగ్య శాఖ నుంచి ఈ మేరకు కీలక ప్రకటన వెలువడింది. 
 
ఆరోగ్య శాఖకు చెందిన వైద్య సేవల అదనపు డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్.కె.వర్మ మీడియాతో కరోనా వైరస్ గురించి, శానిటైజర్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైరస్ వల్ల దేశంలో అసాధారణ స్థితి నెలకొందని చెప్పారు. కరోనా వైరస్ గురించి అనేక పరిశోధనలు జరుగుతున్నాయని.... వైరస్ స్వభావం గురించి పూర్తి వివరాలు తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. మనల్ని మనం రక్షించుకోవడానికి మాస్కులను ఉపయోగించాలని సూచించారు.             
 
తరచూ వేడి నీళ్లు తాగాలని.... చేతులు బాగా కడుక్కుంటూ ఉండాలని... శానిటైజర్లను మాత్రం అతిగా వాడవద్దని తెలిపారు. శానిటైజర్ల గురించి నిపుణులు హెచ్చరించడం ఇదే తొలిసారి కాదు. అతిగా హ్యాండ్ శానిటైజర్లు వాడటం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే బాక్టీరియా సైతం చనిపోతుందని గతంలోనే నిపుణులు చెప్పారు. సబ్బు, నీళ్లు అందుబాటులో ఉన్నప్పుడు వాటినే ఎక్కువగా వాడాలని సూచనలు చేశారు. 
 
దేశంలో గత 24 గంటల్లో 48,916 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 12,36,861కి చేరింది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఏపీలో ప్రతిరోజూ 8,000కు అటూఇటుగా కేసులు నమోదు కాగా తెలంగాణలో 1,500కు అటూఇటుగా కేసులు నమోదవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: