బెజవాడలో టీడీపీకి చెక్... పీవీపీ ప్లేస్‌లో మరో నేతకు జగన్ బాధ్యతలు...?
విజయవాడ (బెజవాడ) ఏపీ రాజకీయాలకు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా ఉండే ఏరియా. ఇలా ఏపీ రాజకీయాలకు సెంటర్‌గా విజయవాడలో ప్రతిపక్ష టీడీపీ హావా కాస్త ఎక్కువగానే ఉంటుంది. రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి విజయవాడలో టీడీపీ డామినేషన్ పెరిగింది. 2019 ఎన్నికల్లో కూడా రాష్ట్రమంతా జగన్ గాలి ఉన్నా సరే, నగరంలో టీడీపీ సత్తా చాటింది. విజయవాడలోని తూర్పు అసెంబ్లీ సీటుని, ఎంపీ సీటుని టీడీపీనే గెలిచింది.
అటు సెంట్రల్ సీటు కేవలం 25 ఓట్ల తేడాతో కోల్పోతే, వెస్ట్ సీటు 7 వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది. అయితే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినా కూడా నగరంలో టీడీపీ హవా ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక్కడ టీడీపీ నేతలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ల హవా ఎక్కువగానే ఉంది. ఇందులో గద్దెకు చెక్ పెట్టేందుకు జగన్..యువనాయకుడు దేవినేని అవినాష్‌కు తూర్పు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. దీంతో తూర్పులో గద్దెకు కాస్త గట్టి పోటీనే ఎదురైంది.
కానీ పార్లమెంట్ పరిధిలో మాత్రం కేశినేనికి చెక్ పెట్టడం జగన్‌కు సాధ్యం కావడం లేదు. గత ఎన్నికల్లో ఓడిపోయిన పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) ఇక్కడ పెద్ద యాక్టివ్‌గా ఉండటం లేదు. ఆయన ఎంతసేపు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. పైగా పీవీపీకి విజయవాడలో పెద్ద ఫాలోయింగ్ ఏమి లేదు. దీంతో పార్లమెంట్ పరిధిలో వైఎస్సార్సీపీ బలపడటం లేదు. ఈ క్రమంలోనే పీవీపీని మార్చేయాలని విజయవాడ వైఎస్సార్సీపీ శ్రేణులు కోరుతున్నాయి.
పీవీపీని పక్కనబెట్టేసి విజయవాడపై పట్టున్న దాసరి జై రమేష్‌కు పార్లమెంట్ బాధ్యతలు అప్పగించాలని చెబుతున్నారు. రమేష్ 1998 పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ తరుపున విజయవాడ నుంచి పోటీ చేసి స్వల్ప మెజారిటీ తేడాతో ఓటమి పాలయ్యారు. రమేష్ సోదరుడు దాసరి బాలవర్ధన్ రావు టీడీపీ తరుపున పోటీ చేసి గన్నవరం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే చంద్రబాబు పార్టీలో సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెప్పి, 2019 ఎన్నికల ముందు దాసరి బ్రదర్స్ వైఎస్సార్సీపీలోకి వచ్చారు. అప్పుడే రమేష్‌కు విజయవాడ ఎంపీ సీటు వస్తుందని ప్రచారం జరిగింది.
కానీ అనూహ్యంగా పీవీపీ సీటు దక్కించుకుని కేశినేని చేతిలో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు పీవీపీ అయితే కేశినేనికు చెక్ పెట్టలేరని, రమేష్ అయితే టఫ్ ఫైట్ ఇస్తారని విజయవాడ వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతుంది. మరి జగన్, పీవీపీని పక్కనబెట్టేసి రమేష్‌కు ఛాన్స్ ఇస్తారో లేదో చూడాలి.