భయాందోళనలో హైదరాబాద్ వాసులు.... శరవేగంగా విజృంభిస్తోన్న సీజనల్ వ్యాధులు...?
హైదరాబాద్ నగరాన్ని ఒకవైపు కరోనా మహమ్మారి గజగజా వణికిస్తోంది. మరోవైపు సీజనల్ వ్యాధులు శరవేగంగా విజృంభిస్తున్నాయి. నగరంలో మలేరియా, డెంగీ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా లక్షణాలు, సీజనల్ వ్యాధుల లక్షణాలు ఒకే విధంగా ఉండటంతో ప్రజల్లో భయాందోళన అంతకంతకూ పెరుగుతోంది. జీ.హెచ్.ఎం.సీ అధికారులు నగరంలో పేరుకుపోతున్న చెత్త గురించి పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో చెత్తాచెదారం ఎక్కడికక్కడ పేరుకుపోయి దోమలు పెరిగాయి.
సాధారణంగా జలుబు, దగ్గు, జ్వరం అంటే ప్రజలు పెద్దగా ఆందోళన పడరు. ప్రస్తుతం జలుబు చేసినా కరోనానేమో అని భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. జ్వరం, జలుబు, దగ్గుతో ఆస్పత్రులకు వెళ్లిన వాళ్లను డాక్టర్లు ముట్టట్లేదు. కరోనా పరీక్ష చేయించుకుని వైరస్ సోకలేదని రిపోర్ట్ తెస్తే మాత్రమే చికిత్స చేస్తామని కరాఖండీగా చెబుతున్నారు. దీంతో రోగులు కరోనా టెస్టింగ్ సెంటర్లకు పరుగెత్తాల్సిన పరిస్థితి నెలకొంది.
కరోనా టెస్టుల్లో నెగిటివ్ వచ్చినా చాలామందికి డెంగీ, మలేరియా పాజిటివ్ నిర్ధారణ అవుతోంది. గతేడాది నగరంలో 2,709 డెంగీ కేసులు, 305 మలేరియా కేసులు నమోదయ్యాయి. బల్దియా ముందస్తు ప్రణాళికను సిద్ధం చేయకపోవడం, కాలనీలు... బస్తీలపై దృష్టి పెట్టకపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయి. సిబ్బంది కరోనా సోకిన రోగుల ఇంటి పరిసరాల్లో శానిటైజేషన్ కు వెళ్లడంతో దోమల నివారణను పట్టించుకునేవాళ్లు లేరు.
హైదరాబాద్ మలేరియా ఆఫీసర్ మాట్లాడుతూ గతేడాది ఎక్కువ సంఖ్యలో డెంగీ కేసులు నమోదైన ప్రాంతాలపై దృష్టి పెట్టామని... డెంగీ, మలేరియా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని... ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో డెంగీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అన్నారు. నగరంలో ఫాగింగ్ చేస్తూ దోమలు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నామని.... చెరువులపై డ్రోన్లతో ఫాగింగ్ చేస్తున్నామని తెలిపారు.