కేసీఆర్ కు ఏమైంది ? ఈ నిర్లక్ష్యానికి కారణం ఏంటి ?
తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవహారశైలిపై రోజురోజుకు విమర్శలు పెరిగిపోతున్నాయి. ప్రతిపక్షాలు ఆయనను టార్గెట్ చేసుకుని తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నాయి. ఆ విమర్శలను తిప్పికొట్టడంలో టీఆర్ఎస్ వెనుకబడి పోతుంది అనే అభిప్రాయాలూ పెరిగిపోతున్నాయి. దీనికి గట్టిగా సమాధానం కూడా చెప్పలేని పరిస్థితుల్లో అధికార పార్టీ నాయకులు ఉన్నారు. ప్రజల్లోనూ ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం అవుతున్నా, కేసీఆర్ మాత్రం ఇవేమీ తనకు పట్టనట్టుగా వ్యవహరిస్తూ, మరింత గందరగోళం కలిగిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి తెలంగాణలో మొదలైనప్పటి నుంచి, కేసీఆర్ తీరు ఇదే రకంగా ఉంటూ వస్తోంది. ఆయన ఎప్పుడూ అన్ని విషయాల్లోనూ, యాక్టివ్ గా ఉంటూ.. ఎక్కడా ఎటువంటి విమర్శలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.
కానీ కరోనా వైరస్ ప్రభావం మొదలైనప్పటి నుంచి ఆయన వ్యవహార శైలిపై తీవ్రస్థాయి విమర్శలకు తావిస్తోంది. అయినా, కేసీఆర్ మాత్రం ఎక్కడా, ఆ విమర్శలను పట్టించుకోనట్టుగానే కనిపిస్తున్నారు. హైకోర్టులు సైతం కేసీఆర్ తీరును తప్పుబడుతున్నాయి. ఇదిలా ఉంటే, తెలంగాణలో క్రమ క్రమంగా బలపడుతూ వస్తున్న బీజేపీ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో పైచేయి సాధిస్తూ వస్తోంది. ముఖ్యంగా కొత్తగా తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్ తో పాటు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం టీఆర్ఎస్ కీలక నాయకులు టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. తాజాగా బండి సంజయ్ కేసీఆర్ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
కేసీఆర్ హైకోర్టు ను సైతం లెక్కచేయకుండా వ్యవహరిస్తున్నారని, ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరంటూ వ్యాఖ్యానించారు. కార్పొరేట్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించలేక ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, దీనంతటికీ కారణం టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని విమర్శించారు.కరోనా వైరస్ వ్యవహారాన్ని చిన్నదిగా చూపించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆరోగ్య శాఖ ద్వారా బయటకు ప్రకటిస్తున్న కరోనా పాజిటివ్ కేసుల వివరాలన్నీ తప్పులతడకగా ఉన్నాయంటూ విమర్శించారు.
తెలంగాణలో పరిస్థితులు ఘోరంగా ఉన్నా, కేసీఆర్ కూల్ గానే కనిపిస్తున్నారని, అసలు కేసీఆర్ ముఖ్యమంత్రి చేసింది ఎందుకు అనే విషయాన్ని ఆయన గుర్తించుకోవాలన్నారు. ఎప్పుడూ.. ఫాంహౌస్, ప్రగతి భవన్ కే పరిమితమైపోవడం తగదని, జనాల్లోకి రావాలని, వారికి అన్ని విధాలుగా భరోసా కల్పిస్తామనే హామీ ఇవ్వగలగాలి అని సూచించారు. అలాగే కరోనా వైరస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఎవరెన్ని విమర్శలు చేస్తున్న కేసీఆర్ మాత్రం తనదైన సైల్ లోనే వెళ్తున్నారు తప్ప ఎక్కడా కరోనా వ్యవహారంలో కంగారు పడుతున్నట్టుగా కనిపించడంలేదు.