
కుటుంబ సభ్యుల నుంచే కరోనా సోకే అవకాశం ఎక్కువ... తాజా అధ్యయనం లో విస్తుపోయే నిజాలు..!
కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో బయట వ్యక్తులతో కంటే ఇంట్లో వారితోనే ఎక్కువ ప్రమాదం ఉందని దక్షిణ కొరియా దేశం యొక్క తాజా పరిశోధనలో తేలింది. మనతో పాటు నివసించే కుటుంబ సభ్యులకు అయినా పని మనుషులకైనా కరోనా వైరస్ సోకితే... అది మనకు సంక్రమించే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదే విషయం కొరియా దేశం తమ తాజా అధ్యయనంలో తెలుసుకుంది. అయితే కొరియా దేశం చేసిన పరిశోధన యొక్క ఫలితాలను యుఎస్ సెంటర్ యొక్క డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రచురించింది. 5,706 మందికి మొదటిగా కరోనా వైరస్ సోకగా... వారి నుంచి 59 వేల పైచిలుకు మందికి కరోనా వైరస్ సంక్రమించింది.
ఐతే ప్రతి 100 మంది కరోనా పీడితుల లో కేవలం ఇద్దరికీ మాత్రమే బయట వ్యక్తుల నుంచి కరోనా వైరస్ సోకింది. కానీ ప్రతి పదిమంది కరోనా బాధితులలో ఒకరికి తమ ఇంట్లో నివసించే వారి నుంచే కరోనా వైరస్ సంక్రమించింది. అంటే వందకి పదిమంది ఇంటి సభ్యుల కారణంగా కరోనా వైరస్ బారిన పడుతున్నారన్నమాట. దీన్నిబట్టి ఇంట్లో వారితోనే కరోనా వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, యువకులు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. వృద్ధులు ఎక్కువగా తమ కుటుంబ సభ్యులతో కలిసిపోతుంటారు. ఎందుకంటే వారికి ఆ వయసులో తమ పిల్లల సంరక్షణ ఎంతైనా అవసరం.
వృద్ధుల్లో ఇమ్యూనిటీపవర్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వారికి కరోనా కరోనా వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారు తమ పిల్లలతో ఎక్కువగా కాంటాక్ట్ లో ఉంటారు కాబట్టి వారి నుంచి వారి పిల్లలకి, వారి పిల్లల నుండి వారికి కూడా సోకే అవకాశం మరీ ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణగా జార్ఖండ్ లోని ధన్ బాద్ లో జరిగిన సంఘటన ని తీసుకోవచ్చు. ఈ ఘటనలో మొట్టమొదటిగా 88 ఏళ్ల వృద్ధురాలికి కరోనా వైరస్ సోకింది. తదనంతరం తన అయిదుగురు పిల్లలకు కరోనా వైరస్ సంక్రమించింది. దురదృష్టవశాత్తు వీళ్ళందరూ కేవలం 20 రోజుల లోపే కరోనా వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. చిన్నపిల్లలకి కరోనా వైరస్ సోకిన వారిలో లక్షణాలు అస్సలు కనిపించవు. దీంతో వారి నుంచి ఇతర కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ సోకే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదేమైనా మీ కుటుంబంలో ఎవరికైనా ప్రతి రోజు బయటికి వెళ్లి వచ్చే పనులు ఉంటే వారిని కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పడం శ్రేయస్కరమని తెలుస్తోంది. అలాగే చిన్నపాటి కరోనా లక్షణాలు కనిపించిన కుటుంబ సభ్యులకు కాస్త దూరంగా ఉండటం అందరికీ మంచిది.