ఈ నెల 22నే ఏపీ మంత్రివర్గ విస్తరణ... వాళ్లకు రివర్స్ షాక్ ఇచ్చిన జగన్...!
ఏపీలో వైఎస్సార్సీపీ వాళ్లు ఎంతో ఆశతో వెయిట్ చేస్తోన్న మంత్రివర్గ విస్తరణ ఖాయమైంది. వైఎస్సార్సీపీకి చెందిన మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ రాజ్యసభ సభ్యులుగా ఎంపిక కావడంతో వీరిద్దరి స్థానంలో కేబినెట్లోకి మరో ఇద్దరిని మంత్రులుగా తీసుకోనున్నారు. అయితే ఆశావాహుల లిస్ట్ మాత్రం ఏకంగా 30 వరకు ఉంది. ఖాళీ అయిన రెండు స్థానాలు కూడా బీసీ వర్గాలకు చెందిన వారివి కావడంతో జగన్ ఎలాంటి ప్రయోగాలకు పోకుండా మరో ఇద్దరు బీసీ నేతలతోనే... ఇంకా చెప్పాలంటే ఏ సామాజిక వర్గాలకు చెందిన వారు వీటిని ఖాళీ చేశారో తిరిగి అదే సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలతోనే ఈ రెండు పదవులను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది.
తూర్పుగోదావరి జిల్లాలో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంతకుముందు మంత్రిగా ఉండేవారు. ఈయన శెట్టిబలిజ. ఇప్పుడు ఇదే సామాజికవర్గానికి చెందిన రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు మంత్రి పదవి దక్కే అవకాశం కన్పిస్తోంది. ఆయన తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇక గుంటూరు జిల్లా రేపల్లె మాజీ ఎమ్మెల్యే మోపిదేవి వెంకటరమణది మత్స్యకార సామాజికవర్గం. ఇప్పుడు ఇదే సామాజికవర్గానికి చెందిన శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజుకు మంత్రి అవుతారని టాక్.
సామాజిక ఈక్వేషన్ల పరంగా జగన్ అదే వర్గాలకు చెందిన వారిని కేబినెట్లోకి తీసుకోనుండడంతో మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న పలువురు కీలక నేతలు, సీనియర్ నేతలు, రెడ్డి సామాజిక వర్గం నేతలకు జగన్ పెద్ద షాక్ ఇచ్చారనే చెప్పాలి. ఏదేమైనా మంత్రి వర్గ విస్తరణ తర్వాత వైఎస్సార్సీపీలో మరిన్ని అసంతృప్తులు బయట పడనున్నాయి.