జగన్ బాటే నా బాట అంటున్న రాజు గారు ! ఇంకా ఏమన్నారంటే ?

పార్టీపై అసమ్మతి వ్యక్తం చేస్తూ, తరచుగా విమర్శలు చేస్తూ, ఢిల్లీ స్థాయిలో పార్టీ పై ఫిర్యాదులు చేస్తూ.. అసలు ఎప్పుడు ఏం చేస్తున్నారో అర్థం కాని స్థితిలో.. కొద్ది రోజులుగా రాజకీయ గందరగోళం సృష్టిస్తున్న నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం ఎవరికి అంతుపట్టని విధంగా మారింది. ఒకవైపు సొంత పార్టీని విమర్శిస్తూ, మరోవైపు పొగుడుతూ మరింత గందరగోళం సృష్టిస్తూ వస్తున్నారు. ఏపీ ప్రభుత్వానికి అనేక లేఖలు సంధిస్తూ, రాష్ట్రంలోని వివిధ సమస్యలపై లేవనెత్తుతూ రఘురామకృష్ణంరాజు హడావుడి చేస్తూ వస్తున్నారు. తాజాగా మరోసారి వివిధ అంశాలపై రఘురామకృష్ణంరాజు స్పందించారు. తన భద్రత విషయమై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన అనేక సంచలన వ్యాఖ్యలు చేశారు. 


ఏపీలో మా పార్టీ అధికారంలో ఉన్నా నాకు రక్షణ లేకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు అవుతుందని అన్నారు. గతంలో ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్న సమయంలో జగన్ రాష్ట్ర పోలీసులు భద్రతపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారని, తాను కూడా ఇప్పుడు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తనకు కల్పిస్తున్న భద్రత పై అనుమానం వ్యక్తం చేస్తున్నానని ఆయన అన్నారు. ఈ సందర్భంగా అమరావతి వ్యవహారాన్ని కూడా లేవనెత్తారు. ప్రజల ఉసురు శాపాలు తగలకుండా ఉండాలంటే, అమరావతిని రాజధానిగా ప్రకటించాలని కోరారు. 


ఒక రకంగా చెప్పుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రైతులను తడిగుడ్డతో గొంతు కోసింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక కేంద్ర బలగాలతో తనకు రక్షణ కల్పించాల్సిందిగా, గత గురువారం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశానని, రాష్ట్ర ప్రభుత్వ రక్షణ తనకు వద్దని, కేంద్ర ప్రభుత్వం రక్షణ మాత్రమే కావాలంటూ పిటిషన్ లో కోరినట్లు తెలిపారు. అలాగే వివిధ అంశాలపై రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి తన రక్షణ విషయమై చర్చిస్తానని అలాగే వివిధ సమస్యలపైనా ఫిర్యాదు చేయబోతున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: