
పల్లెలో పంటల గిరాకీ లాక్ డౌన్ లో ఎలా ఉందో..!
ప్రపంచం 2008 ఆర్థిక మందగతి నుంచి పూర్తిగా కోలుకోకముందే గోరుచుట్టుపై రోకటిపోటులా కొవిడ్ సంక్షోభం వచ్చిపడింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయి అన్ని దేశాల్లో నిరుద్యోగం జడలు విప్పి నర్తిస్తోంది. కొవిడ్ దెబ్బ నుంచి తేరుకోవడానికి చాలా ఏళ్లే పట్టేట్లుంది. ఇప్పటికే ప్రభుత్వానికి భారీ ఆదాయ నష్టం, పెరిగిపోయిన కేంద్ర, రాష్ట్రాల విత్త లోటు, పడిపోయిన ఎగుమతులు, తరిగిపోయిన ప్రైవేటు పెట్టుబడులు, కుటుంబాలూ సంస్థల మీద అలవికాని రుణ భారం, బ్యాంకులకు గుదిబండలా తయారైన నిరర్థక ఆస్తుల వల్ల భారతదేశ అభివృద్ధి పెద్దయెత్తున కోసుకుపోతోంది. ఫలితంగా రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా క్షీణించింది. భారతదేశానికి ప్రస్తుతం భారీగా విదేశ మారక ద్రవ్య నిల్వలు పోగుపడిన మాట నిజమే కానీ, వాటిని చూసి మురిసిపోతూ కూర్చుంటే అది పెద్ద పొరపాటవుతుంది. విదేశ ద్రవ్య నిల్వలను మన ప్రభుత్వ మిగులుగా భ్రమించకూడదు. అలాగని భవిష్యత్తుపై ఆశే లేదని కాదు.
ప్రస్తుత ఆర్థిక కారుచీకట్లలో గ్రామీణార్థికం కాంతిరేఖలా మెరుస్తోంది. దీన్ని మరింత ప్రకాశించేట్లు చేయాలి. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ కుటుంబాలపై రుణ భారం తక్కువ. బ్యాంకులు వీరికి అప్పులు ఇవ్వడానికి ముందుకు వస్తే, వారు వస్తుసేవలపై ఎక్కువ ఖర్చు చేయగలుగుతారు. దానివల్ల గిరాకీ పెరుగుతుంది.
నిరుడు నాలుగు కోట్ల ఎకరాల్లో ఖరీఫ్ నాట్లు పడగా, ఈ ఏడాది ఆ విస్తీర్ణం 5.8 కోట్ల ఎకరాలకు చేరుకోవడం గొప్ప శుభ సూచన. గతేడాదికన్నా వరి విస్తీర్ణం 26 శాతం, పప్పుగింజల సాగుబడి 160 శాతం పెరిగాయి. నూనె గింజల సాగు 85శాతం, పత్తి 35శాతం అధికమయ్యాయి. ఈ ఏడాది మిడతల బెడద, ప్రకృతి వైపరీత్యాలేవీ సంభవించకపోతే పంటలు విరగకాస్తాయి. అమెరికా సహా పలు దేశాల్లో పంటల విస్తీర్ణం పోయిన సంవత్సరం కన్నా తగ్గినందువల్ల మన వ్యవసాయ మిగులుకు అంతర్జాతీయ విపణిలో గిరాకీ, దాంతోపాటే ఎగుమతుల వృద్ధి నమోదు కానుందని అర్థమవుతుంది.