రేపు కేసీఆర్ కీలక భేటీ.. ఆ విషయాలపై ఏం తేలుస్తారో.. !
నీటిపారుదల శాఖలోని అన్ని విభాగాలను వెంటనే ఒకే గొడుగు కిందకి తీసుకురావాలని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. ఈ మేరకు కసరత్తు ప్రారంభించింది. రేపు కీలకమైన ఇంజనీరింగ్, ఇరిగేషన్ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. కోటికి పైగా ఎకరాలకు సాగునీరు అందించే గొప్ప వ్యవస్థ ఏర్పడిందని, దాన్ని సమర్థంగా నిర్వహించుకోవడం ఎంతో ముఖ్యమని చెబుతున్నారు కేసీఆర్. ఈమేరకు అధికారులకు కీలక సూచనలు చేయనున్నారు.
నీటి పారుదల శాఖ ముఖ్య అధికారులతో రేపు సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. సాగునీటి శాఖను పునర్వ్యవస్థీకరించి బలోపేతం చేయాలని భావిస్తున్న ముఖ్యమంత్రి.. ఈమేరకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం నీటి పారుదల శాఖ చిలువలు, పలువలుగా ఉంది. భారీ, మధ్యతరహా, చిన్న తరహా, ఐడిసి, ప్రాజెక్టులు, ప్యాకేజీలుగా విభజించి ఉంది. ఇదంతా ఒకే గొడుకు కిందికి రావాలని, తద్వారా పర్యవేక్షణ పటిష్టంగా ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. అందుకోసం నీటి పారుదల శాఖను 15-20 ప్రాదేశిక విభాగాలుగా మార్చి, ఒక్కో దానికి ఒక్కో సిఇని ఇంచార్జిగా నియమించాలని నిర్ణయించారు. ఆ సిఇ పరిధిలోనే ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, లిఫ్టులు, కాలువలు, చెరువులు, చెక్ డ్యామలు సమస్తం ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. దీనికి సంబంధించి ముసాయిదా తయారు చేయాలని గతవారం జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తాజాగా రేపు జరిగే రివ్యూ మీట్ లో ఈ అంశాలపై చర్చించనున్నారు.
నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సిఎం కార్యదర్శి స్మితా సభర్వాల్ రెండు రోజుల పాటు నీటిపారుద శాఖ పునర్వ్యవస్థీకరణపై వర్క్ షాపు నిర్వహించి ముసాయిదా రూపొందించారు. దీనిని రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ కు సమర్పిస్తారు. ఈ ముసాయిదాపై సమీక్షలో సర్వ సమగ్ర చర్చ జరిపి, తుది నిర్ణయం తీసుకుంటారు. సమగ్ర అవగాహనతో ప్రణాళికలు వేసి వాటిని అమలు చేయడంతో ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పడిన ఆరేళ్లలోనే నీటి పారుదలరంగంలో మంచి ఫలితాలు వచ్చాయన్నారు సీఎం కేసీఆర్. భారీ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం, చెరువులు పునరుద్ధరించడం వంటి చర్యలతో సాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని తెలిపారు.
ఎక్కువ జోన్లను ఏర్పాటు చేసి, ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు, చెరువుల నిర్వహణ చేపడితే.. సాగునీరు చివరి ఆయకట్టు వరకూ అందుంతుందని కేసీఆర్ అధికారులకు సూచిస్తున్నారు. మొత్తంమీద.. గతంలో మాదిరిగా భారీ, మధ్య తరహా, చిన్న తరహా, ఐడీసీ అని నాలుగు విభాగాలుగా కాకుండా నీటి పారుదల శాఖ అంతా ఒకే విభాగంగా తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం.