అనంతపురంలో దారుణం: ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన వాలంటీర్..!
ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. మాయ మాటలతో అమ్మాయిని నమ్మించి లోబర్చుకొని గర్భవతి చేసి మొహం చాటేశాడు ఓ గ్రామ వాలంటీర్. అనంతపురం జిల్లాలోని శింగనమల మండలం నాగులగుడ్డం తండాకు చెందిన గ్రామ వలంటీర్ కు కర్నూలు జిల్లా తుగ్గలికి చెందిన యువతితో పరిచయమైంది. అనంతపురంలో యువతి తండ్రి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. వరలక్ష్మీబాయి ఇంటర్ చదువుతోంది. అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తోంది. వివరాల్లోకి వెళ్తే..
గతేడాది తన సోదరుడికి చికిత్స చేయించేందుకు కిరణ్ నాయక్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలో యువతితో కిరణ్‌కి పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. అతను యువతిని ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబరుచుకున్నాడు. తీరా ఆమె గర్భం దాల్చడంతో ఈ విషయం ఇంట్లో తెలిసిపోయింది. వెంటనే యువతి తల్లిదండ్రులు కిరణ్ పేరెంట్స్‌ని సంప్రదించడంతో పెళ్లి చేస్తామని ఒప్పుకున్నారు.
కొద్దీ రోజులు గడిచిన తర్వాత కిరణ్ యువతిని దూరం పెడుతూ ఆమెతో సంబంధం లేనట్టు వ్యవహరించడంతో యువతి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో వారు పెళ్లి జరిపిస్తామని హామీ ఇచ్చారు. కిరణ్ కుటుంబ సభ్యులు పెళ్ళికి కొద్దీ సమయం కావాలని అడగడంతో యువతి కుటుంబ సభ్యులు ఓకే చెప్పారు.
గడువు ముగిసే రోజు వచ్చాక మళ్లీ అడ్డం తిరిగాడు గ్రామ వలంటీర్. బంధువులతో కలసి ఏకంగా యువతి కుటుంబంపై సభ్యులపై దాడి చేసేందుకు యత్నించాడు. దీంతో యువతి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. తన కూతురిని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని.. పెళ్లి చేసుకుంటానని పిలిపించి తమపై దాడి చేశారని బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒక్కటే కులమని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి మోసం చేశాడని బాధితురాలు వాపోయింది. తనకు న్యాయం జరిగే వరకూ పోరాడతానని ఆమె తెలిపింది.