
హోల్ సేల్ ధరలు తగ్గిన..ఈ మధ్యన రిటైల్ ధరలు మార్పు లేదు ఇందుకేనా..?
ఇటీవల కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూన్‌లో హోల్ సేల్ ద్రవ్యోల్బణం -1.8 శాతానికి పడిపోయింది. ఇదే సమయంలో రిటైల్ ద్రవ్యోల్బణం మాత్రం 6.09 శాతానికి చేరింది. హోల్ సేల్ ధరలు తగ్గినా ఆ ప్రభావం వినియోగదారులకు అందకపోడవం వల్ల ఈ స్థాయిలో వ్యత్యాసం ఏర్పడింది. మరి ధర తగ్గుదల ఎందుకు బదిలీ కాలేదు? హోల్ సేల్-రిటైల్ మార్కెట్ల మధ్య వ్యత్యాసానికి కారణాలేమిటి?2020 జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) 6.09 శాతం. హోల్ సేల్ ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) మాత్రం -1.81 శాతం. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలివి.క్లుప్తంగా చెప్పాలంటే హోల్ సేల్ ధరల్లో హెచ్చుతగ్గులను సూచించే సూచీనే డబ్ల్యూపీఐ, వినియోగదారు ధరల్లో హెచ్చు తగ్గులను సూచించేదే సీపీఐ. ఈ గణాంకాలు ప్రతి నెల(అంతకుముందు నెలవి) వస్తాయి.
సాధారణంగా హోల్ సేల్ ధరలు పెరిగితే.. ఆ ప్రభావం రిటైల్ ద్రవ్యోల్బణంపై పడుతుంది. అప్పుడు రిటైల్ ధరలు కూడా పెరుగుతాయి. అయితే ఈ సారి అందుకు విరుద్ధంగా.. డబ్లూపీఐ తగ్గినా.. సీపీఐ మాత్రం భారీగా పెరిగింది.సీపీఐ ఆధారంగా చేసుకునే రిజర్వు బ్యాంక్ రేపో రేటు (బ్యాంకులకు ఇచ్చే అప్పులపై వడ్డీ)ను నిర్ణయిస్తుంది. ఆర్బీఐ నిర్ణీత రిటైల్ ద్రవ్యోల్బణం 4±.2 శాతంగా ఉండాలి. గరిష్ఠ ద్రవ్యోల్బణం ఆరు శాతానికి మించకూడదు. జూన్ నెలలో ఈ స్థాయిని దాటి ధరలు పెరిగాయి.
టోకు ద్రవ్యోల్బణం తగ్గినా.. రిటైల్ ద్రవ్యోల్బణం పెరగటం అనేది హోల్ సేల్ ధరల్లో తగ్గుదల.. వినియోగదారులకు బదిలీ కాలేదన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. దీనితోపాటు మరిన్ని అంశాలు కూడా రెండు ద్రవ్యోల్బణాల్లో వ్యత్యాసానికి కారణం అవుతున్నాయి.
బేవరేజెస్‌కు సీపీఐలో 54.2 శాతం వెయిట్ ఉంది. అదే టోకు ధరల సూచీలో కేవలం 15.3 శాతం వెయిట్ ఉంది. ఆహార పదార్థాల ధరల పెరుగుదల వల్ల రిటైల్ ద్రవ్యోల్బణం, టోకు ధరల ద్రవ్యోల్బణం కంటే ఎక్కువ పెరుగుతుంది.
సీపీఐలో ఫుడ్ అండ్ బేవరేజెస్ తర్వాత సేవలకు (ఆరోగ్యం, రవాణా, కమ్యూనికేషన్స్, విద్యా, పర్సనల్ కేర్) ఎక్కువ వెయిట్ (27 శాతం) ఉంది. ఇంధనం, విద్యుత్‌కు డబ్ల్యూపీఐలో 13.15 శాతం ఉండగా... సీపీఐలో 7.94 శాతం వెయిట్ మాత్రమే ఉంది. వెయిటేజీల్లో తేడాల వల్ల కూడా.. ద్రవ్యోల్బణం గణాంకాల్లో తేడాలు వచ్చినట్లు తెలుస్తోంది.