హైదరాబాద్ బిర్యానీకి కరోనా ఎఫెక్ట్... ఏం జరిగిందంటే.....?
దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభించిన తొలినాళ్లలో 200 లోపే కేసులు నమోదు కాగా ప్రస్తుతం వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఏపీలో గత 24 గంటల్లో నాలుగు వేల కేసులు నమోదయ్యాయంటే వైరస్ తీవ్రతను అంచనా వేయడం కష్టం కాదు. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని రంగాలపై వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. వైరస్ వ్యాప్తి వల్ల చిరువ్యాపారుల నుంచి పెద్దపెద్ద వ్యాపారాలు చేసేవాళ్లు సైతం ఇబ్బందులు పడుతున్నారు.
ఆర్థిక, వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక, విద్యా రంగాలపై సైతం వైరస్ ప్రభావం పడింది. ఉద్యోగులు వైరస్ వ్యాప్తి వల్ల ఇళ్లకు పరిమితం కావాల్సిన పరిస్థితి నెలకొంది. చివరకు హైదరాబాద్ బిర్యానీపై కూడా కరోనా వైరస్ ప్రభావం పడింది. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాల్లో సైతం హైదరాబాదీ బిర్యానీ హౌసెస్ ఉంటాయంటే దాని ప్రాముఖ్యత సులభంగానే అర్థమవుతుంది. అయితే హైదరాబాదీ బిర్యానీకి నగరంలోనే కష్టకాలం వచ్చింది.
తాజాగా వెలుగులోకి వస్తున్న లెక్కలు చెబుతున్న సమాచారం ప్రకారం గతంలో నిమిషానికి 123 బిర్యానీ ప్యాకెట్లు అమ్ముడవగా ప్రస్తుతం ప్రస్తుతం నిమిషానికి 30 బిర్యానీ ప్యాకెట్లు అమ్ముడవుతున్నాయి. కొన్ని ప్రముఖ రెస్టారెంట్లకు అసలు ఆర్డర్లే రావడం లేదని తెలుస్తోంది. బావర్చిలో గతంతో పోలిస్తే 25 శాతం తక్కువగా సేల్స్ నమోదవుతున్నట్లు సమాచారం. కరోనా నేపథ్యంలో హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లి తినే అవకాశం లేదు.
ప్రస్తుతం ఇంట్లో వండుకున్న ఆహారం తినడానికే ప్రజలు ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో రోజుకు 50,000 నుంచి 1,00,000 రూపాయల వ్యాపారం చేసిన హోటళ్లు ప్రస్తుతం 10,000 నుంచి 20,000 వరకు వ్యాపారం చేస్తున్నాయి. ఆదాయం తగ్గడం వల్ల వ్యాపారం చేసేవాళ్లు సిబ్బందికి జీతాలు ఇవ్వలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైరస్ అదుపులోకి వచ్చేంత వరకు ఇదే పరిస్థితి దేశవ్యాప్తంగా నెలకొనే అవకాశం ఉంది.