యుద్దమంటే చైనా సైన్యానికి వణుకా.. ?

NAGARJUNA NAKKA

యుద్ధ రంగంలో ఆయుధ సామర్థ్యాన్ని లెక్కగట్టడానికి  ఓ కొలమానం ఉండాలి. దానినే.. 'కాంబాట్‌ ప్రూవెన్‌' అని వ్యవహరిస్తారు. దీనర్ధం.. యుద్ధాల్లో పాల్గొని.. శక్తిసామర్థ్యాలు నిరూపించుకోవడం... ఇప్పుడు మనం కొనుగోలు చేస్తున్న రఫెల్స్‌ అయినా.. ఇప్పటికే కొనుగోలు చేసిన అపాచీ హెలికాప్టర్లైనా... వాటి సామర్థ్యాన్ని నిరూపించుకోవడం అనే అంశం దళాలకు కూడా వర్తిస్తుంది. ఈ విషయంలో చైనా కంటే భారత దళాలకు అనుభవం ఎక్కువ. నిత్యం కశ్మీర్‌ పర్వత సానువుల్లో ఉగ్రవాదులు, పాక్‌కు చెందిన 'బోర్డర్‌ యాక్షన్‌ టీమ్‌'లతో మన వాళ్లు తలపడుతుంటారు. పర్వత యుద్ధతంత్రంలో ప్రపంచంలోనే అత్యుత్తమైన దళం భారత్‌ వద్ద ఉంది.  ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు.. సాక్షాత్తూ  చైనా సైనిక నిపుణుడు హువాగ్‌ గ్వాజీ. 

1962, 67ల్లో చైనా తీరును చూసిన భారత్‌... 1970 నుంచి పర్వత యుద్ధతంత్రంపై దృష్టి పెట్టింది. భారత్‌, పాక్‌, మయన్మార్‌ సరిహద్దుల్లో పర్వత ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి నుంచే శత్రుదళాలు, టెర్రర్ గ్రూప్స్... దేశంలోకి చొరబడుతుంటారు. దీంతో భారత దళాలు పర్వతాలపై పట్టు సాధించడంపై దృష్టిపెట్టాయి. భారీ సంఖ్యలో సైనికులకు పర్వత యుద్ధతంత్రంపై శిక్షణ ఇచ్చింది.  మన బలగాల్లో అత్యధిక మంది సర్వీసు కూడా పర్వతాలపైనే ఉంటోంది.  మౌంటెన్‌ స్ట్రైక్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేయడంపై కూడా దృష్టిపెట్టింది.

ఓ అంచనా ప్రకారం భారత్‌ వద్ద దాదాపు 12 డివిజన్లతో 2 లక్షల మంది పర్వత యుద్ధతంత్ర నిపుణులు ఉన్నారు.  వీరికి పారామిలటరీ సిబ్బంది అదనం. పారామిలటరీ కూడా ఇప్పటికే పర్వత కనుమల పహారా కాస్తోంది. ప్రపంచలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్‌లో పనిచేసిన అనుభవం మన సైనికుల సొంతం. అక్కడ కనీసం ఆరువేల మంది సిబ్బంది నిత్యం పహారా కాస్తున్నారు.

భారత్‌కు జమ్ము సమీపంలో హై ఆల్టిట్యూడ్‌ మౌంటెన్‌ వార్‌ఫేర్‌ స్కూల్‌ కూడా ఉంది. ప్రపంచ అత్యున్నత యుద్ధతంత్ర శిక్షణ కేంద్రాల్లో ఇది కూడా ఒకటి.  మిత్రదేశాలకు చెందిన దళాలు ఇక్కడ శిక్షణ పొందడానికి వస్తాయి. వీటిల్లో అమెరికా, రష్యా, యుకే  వంటి అగ్రరాజ్యాలు కూడా ఉన్నాయి.  దళాలను పర్వత ప్రాంతాలకు తగ్గట్లు శారీరకంగా తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత.  దీనికి అదనంగా కార్గిల్‌ బ్యాటిల్‌ స్కూల్‌ను కూడా ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తోంది.  ఇటువంటి  శిక్షణ, వ్యూహాల కారణంగా పాక్‌కు కశ్మీర్‌ సరిహద్దుల్లో మనవాళ్లు గట్టిగా సమాధానం చెప్పగలుగుతున్నారు.  ముఖ్యంగా కార్గిల్‌ పాఠాలు మనవాళ్లకు ఇప్పుడు ఉపయోగపడనున్నాయి.

ఎల్‌ఏసీ వద్ద చైనా దళాలు కవ్వింపు చర్యలు చేపడుతుండటంతో భారత్‌కూడా  పర్వత యుద్ధతంత్ర నిపుణులను రంగంలోకి దింపాయి.  3 వేల 488 కిలోమీటర్ల సరిహద్దులో వీరిని మోహరించింది. ఇక్కడకు చైనా సైన్యం ఇప్పటికే ట్యాంకులను తరలించింది. కానీ, పర్వతాలపై వాటి కదలికలు పెద్ద సమస్యగా మారతాయి. మరోపక్క భారత దళాలు గెరిల్లా యుద్ధతంత్రంలో ఆరితేరడంతో చైనాకు  ఆందోళనకరంగా మారింది.  

చిన్న బృందాలుగా మారి పర్వతశిఖరాల్లో దాక్కొని పోరాడటం వీరి ప్రత్యేకత. ఇలాంటి చోట్ల సూదిమొనను కూడా కొట్టగలిగేంత కచ్చితత్వంతో చైనా శతఘ్నులు, క్షిపణులు పనిచేయాల్సి ఉంటుంది. లేకపోతే అవి కొన్ని మైళ్ల అవతలకు దూసుకుపోతాయని నిపుణులు చెబుతున్నారు.

 టిబెట్‌ పీఠభూమిపై నుంచి వచ్చే చైనా సైన్యాలకు కే2, నందాదేవి, కాంచనగంగ, నామ్చే బార్వ వంటి శిఖరాలు సవాళ్లు విసురుతాయి.  వీటికి తోడు మన మౌంటెన్‌ వార్‌ఫేర్‌ బృందాలు  అక్కడకు చేరడంతో చైనా అడుగు ముందుకేయాలంటే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: