రుణాలు తీసుకున్న వారికి శుభవార్త... మరో మూడునెలలు మారిటోరియం పెంచే ఆలోచనలో ఆర్బీఐ...?
దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తూ ఉండటంతో కేంద్రం లాక్ డౌన్ ను మరోసారి పొడిగించిన సంగతి తెలిసిందే. కేంద్రం లాక్ డౌన్ ను పొడిగించడంతో ఆర్బీఐ మరో మూడు నెలలు మారటోరియం పెంచే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎస్‌బిఐ పరిశోధన నివేదిక రుణాలు తిరిగి చెల్లించడంపై తాత్కాలిక నిషేధాన్ని మరో మూడు నెలలు పెంచే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఆగస్టు 31వ తేదీ వరకు కేంద్రం మారటోరియం విధించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
అయితే ఆర్బీఐ సెప్టెంబరులో కంపెనీలు వడ్డీతో కలిపి చెల్లించే అవకాశం కల్పించనున్నట్టు తెలుస్తోంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం లోన్లను తిరిగి చెల్లించడంలో విఫలమైన ఖాతాలను నిరర్ధక రుణాలుగా వర్గీకరించే అవకాశం ఉంది. మార్చి నెల 27వ తేదీన మూడునెలలపాటు ఎటువంటి ఈఎంఐలు కట్టక్కర్లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉద్యోగులకు, వ్యాపారులకు ఊరట కలిగించాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
ఆర్బీఐ చేసిన ప్రకటనతో ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ చెల్లింపులకు సంబంధించి వేతనదారులకు ఊరట లభించింది. ఆర్‌బీఐ అన్ని లోన్లపై 3 నెలల వరకు(ఈ నెల 31 వరకు) మారటోరియం విధించింది. కేంద్రం లాక్ డౌన్ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య సేవలు స్తంభించాయి. పలు కంపెనీలు ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించగా... పలు కంపెనీలు ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాయి.
లాక్ డౌన్ దెబ్బకు రియల్ ఎస్టేట్, పర్యాటక, ఆతిథ్యరంగాల వ్యాపారాలు కరోనా దెబ్బకు కుదేలయ్యాయి. వ్యాపారాలు పూర్తిగా మూత పడడంతో కనీసం ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. పలు కంపెనీలు బ్యాంకుల వద్ద తీసుకున్న అప్పులకు వాయిదాలు చెల్లించలేమని చెప్పటంతో ఆర్బీఐ మారటోరియం మూడు నెలలు పొడిగిస్తూ ప్రకటన చేసింది. ఆర్బీఐ మారటోరియంను మరో మూడు నెలలు పొడిగిస్తే మాత్రం రుణాలు తీసుకున్న వారికి ఊరట కలుగుతుంది.