అనూహ్యంగా తెరపైకి వచ్చిన పవన్ కల్యాన్ రాజకీయ పార్టీ ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలోని కొత్త పార్టీ అవకాశాలను దెబ్బతీసేదిలా ఉంది! కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో చేరతారు అనే ప్రచారం పొందిన నేతలంతా ఇప్పుడు పవనిజం పార్టీ వైపు చూస్తుండటమే ఇందుకు రుజువు! అసలు పవన్ పార్టీ పెడతాడని ఎవరూ ఊహించలేదు. అలాంటి వార్తలను పుకార్లుగా కొట్టిపడేశారంతా. అయితే ఇప్పుడు ఆ పుకార్లే కాస్తంత గట్టిగా వినిపిస్తుండే సరికి నిజమేనేమో అనుకోవాల్సి వస్తోంది!
దీంతో నేతలు అలర్ట్ అయ్యారు. ఎన్నికొత్త పార్టీలు వచ్చినా అందులో ఉండేది పాత నేతలే అన్నట్టుగా ఇప్పుడు చాలా మంది రాజకీయ నేతలు పవన్ వైపు చూస్తున్నట్టు సమాచారం. పవర్ స్టార్ ఆధ్వర్యంలో రానున్న పార్టీ ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకొందామని వారు అనుకొంటున్నారట. ఈ జాబితాలో అనేక మంది సీనియర్ తెలుగుదేశం, కాంగ్రెస్ నేతలున్నట్టు సమాచారం!
ఇప్పటికే మూడేళ్ల కిందట ఆవిర్భవించిన జగన్ పార్టీ కాంగ్రెస్ , తెలుగుదేశంల నుంచి అనేక మంది నేతలను తనవైపుకు తిప్పుకొంది. రాష్ట్రంలోని ప్రముఖమైన మూడో ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించింది. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కొన్ని ఓట్లను ప్రభావితం చేయగల స్థాయికి చేరుకొంది. అదిగాక ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ వచ్చి కాంగ్రెస్ లో భవిష్యత్తు కోల్పోయిన వారికి ఆశాజనకంగా మారిందనుకొంటున్న నేపథ్యంలో ఉన్నట్టుండి పవన్ కల్యాన్ పార్టీ తెరపైకి రావడం చాలా విచిత్రంగా మారింది! మొత్తంగా పవన్ పార్టీ ప్రధానంగా కిరణ్ పార్టీనే దెబ్బతీస్తుందని విశ్లేషకుల అంచనా!
మరింత సమాచారం తెలుసుకోండి: