హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త...!

Reddy P Rajasekhar

హైదరాబాద్ మెట్రో అధికారులు ప్రయాణికుల సౌలభ్యం కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ప్రయాణికులకు మెట్రో పాసులు తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. మెట్రో ప్రయాణికులకు ఈ వార్త శుభవార్త అనే చెప్పాలి. నిన్న మెట్రో అధికారులు పేటీఎం భాగస్వామ్యంతో ఆన్ లైన్ టికెట్ విధానాన్ని ప్రవేశపెట్టారు. మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, పేటీఎం వైస్ ప్రెసిడెంట్ అభయ్ శర్మ, అధికారులు లాంఛనంగా కొత్త టికెట్ విధానాన్ని ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా మెట్రో రైల్ ఎండీ మాట్లాడుతూ త్వరలో మెట్రో పాసుల గురించి నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. ప్రయాణికులకు సుఖవంతమైన ప్రయాణాన్ని అందించాలని తాము కృషి చేస్తున్నామని అన్నారు. పేటీఎం కల్పించిన నూతన సదుపాయాలతో ఎక్కువ సమయం నిలబడకుండానే ప్రయాణికులు టికెట్లు తీసుకొని సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చని తెలిపారు. దేశంలోనే డిజిటల్ మార్కెట్ లో పేటీఎం ఎంతో పెద్ద అంస్థ అని అన్నారు. మూడు నెలల క్రితం ప్రయాణికుల కోసం అందుబాటులోకి తెచ్చిన క్యూఆర్ కోడ్ టికెటింగ్ విధానం ఉపయోగిస్తున్న వారి సంఖ్య 60 వేలకు చేరిందని అన్నారు. 

భవిష్యత్తులో ఒకే టికెట్ తో మెట్రోతో పాటు ఆర్టీసీ, ఉబర్ లలో ప్రయాణం చేసేలా ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నామని ప్రకటన చేశారు. రాబోయే రెండు, మూడు వారాలలో మెట్రో పాసులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. మెట్రో ప్రయాణికులు కరోనా వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. కెమికల్ శానిటైజర్లతో ప్రతిరోజూ రైళ్లను శుభ్రం చేస్తున్నట్టు తెలిపారు. 
 
కరోనా భయంతో పది వేల మంది ప్రయాణికులు తగ్గారని అన్నారు. 46 కిలోమీటర్ల ట్రాక్ పరిధిలో 8 ఆర్‌ఒబిఎస్‌ల నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలను చేపట్టామని చెప్పారు. ప్రయాణికులు పేటీఎం ద్వారా టికెట్ బుక్ చేసుకొని ప్రయాణించవచ్చని తెలిపారు. ఎన్వీఎస్ రెడ్డి స్వయంగా రసూల్‌పుర మెట్రో స్టేషన్‌లో పేటీఎంతో టికెట్ బుక్ చేసుకునే విధానాన్ని చూపించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: