చైనాలో మరో భయంకర వైరస్..!

NAGARJUNA NAKKA

కరోనా వైరస్‌తో కకావిలకమవుతున్న చైనాకు మరో దెబ్బ తగిలేలా ఉంది. ఇంకో వైరస్ ముప్పు పరణమించేలా కనిపిస్తోంది. చైనా దేశంలో బర్డ్ ఫ్లూ వ్యాధిని గుర్తించినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో ఆ కంట్రీ బెంబేలెత్తిపోతోంది.

ఇప్పటికే కరోనాతో విలవిలలాడిపోతున్న చైనాలో మరో భయంకర వైరస్‌ వెలుగుచూసింది. బర్డ్‌ ఫ్లూ ఆనవాళ్లను కూడా గుర్తించినట్లు వెల్లడించారు ఆ దేశ  వ్యవసాయశాఖ మంత్రి. కరోనాకు కేంద్రంగా ఉన్న హుబి ప్రావిన్సు దక్షిణాన ఉన్న హునన్‌ ప్రావిన్సులో బర్డ్‌ ఫ్లూకు కారణమయ్యే హెచ్‌5ఎన్‌1 వైరస్‌ గుర్తించినట్లు  తెలిపారు. షయోయాంగ్‌ నగరం శివారులోని ఓ కోళ్లఫారమ్‌లో ఈ వైరస్ ధాటికి ఇప్పటి వరకు 4 వేల 5 వందల కోళ్లు మరణించాయి. దీంతో అప్రమత్తమైన  అధికారులు వెంటనే అక్కడికి చేరుకొన్నారు. వైరస్ సోకిన కోళ్లను మిగిలిన కోళ్ల నుంచి వేరు చేశారు. ఫ్లూ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే  ఈ వైరస్‌ వల్ల ఇప్పటి వరకు మనుషులెవరూ ప్రభావితం కాలేదు.

మరోవైపు ప్రపంచవ్యాప్తంగానూ ఈ వైరస్‌ విజృంభిస్తోంది. ఫిలిప్పీన్స్‌లో కరోనా సోకి ఓ వ్యక్తి మరణించారు. చైనా వెలుపల నమోదైన తొలి మరణం ఇదే కావడం విశేషం. మరణించిన వ్యక్తి సతీమణి వుహాన్‌కు చెందినవారిగా గుర్తించారు. ఆమెలో మాత్రం వైరస్‌కు సంబంధించిన ఎలాంటి లక్షణాలు లేవని వైద్యులు తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 20కి పైగా దేశాల్లో 130 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. అమెరికాలో ఇప్పటి వరకు 8 మందికి ఈ వైరస్‌ సోకినట్లు గుర్తించారు. వీరిలో చాలా మంది ఇటీవల హుబి ప్రావిన్సుకు వెళ్లి వచ్చిన వారే. వుహాన్‌ నుంచి ఢిల్లీకి చేరుకున్న భారతీయులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. 14 రోజుల అనంతరం వీరిలో కరోనా లక్షణాలేవీ లేవని నిర్ధారణకు వచ్చిన తర్వాతే ఇళ్లకు పంపించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: