దేశాభివృద్ధికి ఈ దశాబ్దం కీలకం... రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు..!

Reddy P Rajasekhar

బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతూ దేశాభివృద్ధికి ఈ దశాబ్దం ఎంతో కీలకమని నవ భారత నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. నెహ్రూ, గాంధీ కలలను ఈ దశాబ్దం నెరవేర్చనుందని చెప్పారు. దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని అన్నారు. రాజ్యాంగం మనకు మార్గదర్శకంగా నిలుస్తుందని దేశ ప్రయోజనాలే మనకు ముఖ్యమని అన్నారు.              
 
పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త పథకాలను ప్రవేశపెట్టాలని రామ్ నాథ్ కోవింద్ కోరారు. ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాఖ్ చట్టాన్ని తీసుకొనిరావటం వలన న్యాయం జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ట్రాన్స్ జెండర్ల హక్కులను కాపాడేందుకు కృషి చేస్తుందని అన్నారు. సుప్రీం కోర్టు వివాదాస్పద రామజన్మభూమి గురించి తీర్పు ఇచ్చిన తరువాత దేశ ప్రజలు ఐక్యంగా ఉండటం హర్షణీయం అని అన్నారు. 
 
గత సెషన్స్ లో పార్లమెంట్ సమావేశాలు రికార్డులు సృష్టించాయని పార్లమెంటు ఆమోదం కీలక బిల్లులకు లభించిందని అన్నారు. 370 అధికరణ రద్దు చారిత్రాత్మకమని ఈ నిర్ణయం తరువాత కశ్మీర్ అభివృద్ధి బాట పట్టిందని అన్నారు. ప్రభుత్వం కొత్త పథకాలను, కొత్త చట్టాలను ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తీసుకొచ్చిందని రామ్ నాథ్ కోవింద్ అన్నారు. ప్రభుత్వం సబ్ కా సాత్ లక్ష్యంతో ముందుకు వెళుతోందని చెప్పారు. 
 
రాష్ట్రపతి పౌరసత్వ సవరణ చట్టం గురించి మాట్లాడుతూ అందరికీ సమాన హక్కులను ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. గాంధీజీ కన్న కలలు పౌరసత్వ సవరణ చట్టంతో నిజం అయ్యాయని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని హింస బలహీనపరుస్తుందని నిరసనలు, హింస గురించి రాష్ట్రపతి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రపతి చేసిన వ్యాఖ్యల గురించి విపక్ష నేతల నుండి నిరసనలు వ్యక్తం కావడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: