బెజవాడ వాసులకు తొలగిపోనున్న ట్రాఫిక్ కష్టాలు !

NAGARJUNA NAKKA

విజయవాడ వాసులకు ఇక నుంచి ట్రాఫిక్ కష్టాలు తొలగిపోనున్నాయ్. నగరంలో నిర్మిస్తున్న రెండు ఫ్లై ఓవర్లలో ఒకటి అందుబాటులోకి వచ్చింది. మరోవారం రోజుల్లొ దీనిపై రాకపోకలకు అనుమతించనున్నారు నేషనల్ హైవే అథారిటీ అధికారులు. అయితే దుర్గగుడి ఫ్లై ఓవర్ మాత్రం ఇంకా తుదిదశకు చేరుకున్నా పూర్తి కావటానికి మరో రెండు నెలలు సమయం పట్టే అవకాశాలున్నాయి.

 

విజయవాడలో ట్రాఫిక్ కష్టాలను అధిగమించేందుకు గత ప్రభుత్వం ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టింది. దుర్గగుడి వద్ద ఒక ఫ్లై ఓవర్, బెంజిసర్కిల్ దగ్గర మరొకటి నిర్మాణం చేపట్టారు. అయితే.. ఆలస్యంగా మొదలైనా బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. బెజవాడ జనాభా పదిహేను లక్షలకు చేరుకుంది. రాజధాని ప్రకటన చేసిన తర్వాత ఈ ఐదేళ్ళలోనే ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోతోంది. పాఠశాలలు, ఉద్యోగాలకు వెళ్ళే వాహనాల ప్రభావం ట్రాఫిక్‌పై పడుతోంది. ప్రధానంగా ఈ ట్రాఫిక్ కష్టాలు బెంజిసర్కిల్, బందరు రోడ్డుల్లోనే ఎక్కువగా కనపడుతుంటాయి. బెజవాడ వాసులు బెంజిసర్కిల్ వద్ద ఫ్లై ఓవర్ ఏర్పాటు కోసం ఏళ్ళ క్రితం నుంచే ఎదురు చూశారు. రెండేళ్ళ క్రితం టీడీపీ హయాంలో బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్ పట్టాలెక్కింది. టీడీపీ ఎంపీ కేశినేని నాని చొరవ తీసుకొని దీనిపై కేంద్రంలో నితిన్ గడ్కరీతో మాట్లాడి రెండు దశల్లో పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు. 

 

ఇక...ఇందులో మొదటి పార్టుగా 1450 మీటర్ల పరిధిలో 82 కోట్లతో బెంజిసర్కిల్  ఫైఓవర్ 2017లో నిర్మాణం ప్రారంభమైంది. తొలుత 615 మీటర్ల పరిధిలో నిర్మించాలని భావించినా చివరికి ఇది 1450 మీటర్లుగా నిర్ణయించారు. 49 పిల్లర్లతో నిర్మిస్తున్న ఈ ఫ్లైఓవర్ కొత్త ప్రభుత్వ ఆసుపత్రి జంక్షన్ నుంచి బెంజిసర్కిల్ మీదుగా జ్యోతి కన్వెన్షన్ వరకు ఉంటుంది. ప్రస్తుతం ఫ్లై ఓవర్ నిర్మాణం అంతా పూర్తైంది. డిసెంబరు 31నాటికి పనులన్నీ పూర్తి చేసిన అధికారులు సంక్రాంతి పండుగ తర్వాత లైటింగ్ ట్రైల్ రన్ కూడా నిర్వహించారు. జనవరి 31వతేదీకి ఫ్లై ఓవర్ అందుబాటులోకి తీసుకురానున్నారు. 

 

ఈ ప్లైఓవర్ వల్ల రామవరప్పాడు దాటిన తర్వాత కొత్త ప్రభుత్వ ఆసుపత్రి జంక్షన్ నుంచి బెంజిసర్కిల్ దాటిన తర్వాత స్కూ బ్రిడ్జి వరకు ట్రాఫిక్ సమస్య ఉండదు. ఫ్లై ఓవర్ రమేష్ ఆసుపత్రి, నిర్మలా ఆసుపత్రి, బెంజిసర్కిల్ జంక్షన్ల మీదుగా వెళ్లిన కారణంగా ట్రాఫిక్ సమస్యను అధిగమించవచ్చు. ఇక పార్ట్ 2 నిర్మాణాన్ని 110 కోట్లతో నిర్మించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా పూర్తి అయింది. ఏప్రిల్‌లో దీనికి శంకుస్థాపన చేయనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: