ఏపీలో నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్... 15,971 ఖాళీల భర్తీ .. ?
ఏపీ సీఎం జగన్ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 15,971 గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేయటానికి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈరోజు సీఎం జగన్ పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ గ్రామ, వార్డ్ సచివాలయాలు మరియు రైతు భరోసా కేంద్రాలు త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
అధికారులకు సీఎం జగన్ మినీ గోడౌన్లపై దృష్టి సారించాలని చెప్పారు. పాఠశాలలకు ప్రహరీ గోడలను ఉపాధి హామీ నిధులతో నిర్మించాలని సూచించారు. గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ఫిబ్రవరి నెల నుండి పెన్షన్లను అందజేయాలని సూచించారు. పెన్షన్ల కొరకు ఎదురుచూపులు లేకుండా చేయాలని సీఎం జగన్ అన్నారు. ఏపీ ప్రభుత్వం గత సంవత్సరం గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహించి 1,26,728 ఉద్యోగాల భర్తీ చేసిన విషయం తెలిసిందే.
కానీ వివిధ కారణాల వలన 1,26,728 ఉద్యోగాలలో 15,971 ఉద్యోగాల భర్తీ జరగలేదు. మిగిలిన ఈ ఉద్యోగాల భర్తీ కొరకు ప్రభుత్వం మరోసారి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టనుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు సీఎం జగన్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో కొత్తగా మరో 300 గ్రామ సచివాలయాలను నిర్మించబోతున్నారని సమాచారం. ఈ 300 గ్రామ సచివాలయాలలో మరో 3,000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని సమాచారం.
సీఎం జగన్ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించిన రోజు నుండి నిరుద్యోగులకు మేలు జరిగేలా ఎన్నో నిర్ణయాలు తీసుకుంటోన్న విషయం తెలిసిందే. దాదాపు 16,000 గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాల భర్తీకి అతి త్వరలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. భారీ స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేయనుండటంపై రాష్ట్రంలోని నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.